ప్రజలే తిరగబడేరోజులు వస్తాయి

25 Jul, 2016 00:37 IST|Sakshi
ప్రజలే తిరగబడేరోజులు వస్తాయి
– చంద్రబాబు సీయం అయితే కరువు కాటకాలే
– గడపగడపకూ వైఎస్‌ఆర్‌ కార్యక్రమంలో పీఏసీ చైర్మన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 
అంబాపురం (బేతంచెర్ల): రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం గడపగడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని అంబాపురంలో మద్దిలేటిస్వామి ఆలయ మాజీ చైర్మన్‌ బాలీశ్వర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ యాదగిరి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్‌రెడ్డితో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తన మాటల గారడితో ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిన చంద్రబాబు, తరువాత ఇచ్చిన హామీలను మరిచాడన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం కరువు కాటకాలేనని విమర్శించారు. 
అప్పులు పుట్టక రైతుల అవస్థలు...
రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకులో అప్పులు పుట్టక రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితులు దాపురించాయన్నారు. నిరుద్యోగభతి, రైతు, పొదుపు రుణాలు, మహిళలకు సెలఫోన్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, 60 సంవత్సరాలు నిండిన వారికి వద్ధాప్య ఫించన్‌ ఇస్తామని హామీఇచ్చి విస్మరించారన్నారు. ప్రస్తుతం ప్రజా సాధికార సర్వే పేరుతో సంక్షేమ పథకాలకు తూట్లు పొడవమే కాకుండా, బ్రతకడానికి ద్విచక్రవాహనం తెచ్చుకున్నా.. సంక్షేమ పథకాలు నిలిపివేసే ప్రమాదం నెలకొందన్నారు. 100 హామీలో ఏ ఒక్కటీ నేరవేర్చలేని అబద్దాల సీఎం చంద్రబాబు అని అన్నారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి, మోసపూరిత హామీలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయలేదని, లేకుంటే ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అయ్యేవాడన్నారు. కావున పాలక పక్షంపై ఎదురు తిరిగేందుకు ప్రజలను చైతన్యం చేసేందుకు గడప గడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమానికి ఆయా కాలనీల్లో అనూహ్య స్పందన లభించింది. కాలనీల్లోని మహిళలు, యువకులు నాయకులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో  వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు మూర్తుజావలి, బాబుల్‌రెడ్డి, ఖాజా హుసేన్, రామంచంద్రుడు, నాగేశ్వరరావు, నక్కరవి, ఎద్దులన్న తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు