ప్రతి పనికీ ఓ లెక్క..పత్రం ఏదైనా పక్కా..!

15 Jul, 2017 04:14 IST|Sakshi
ప్రతి పనికీ ఓ లెక్క..పత్రం ఏదైనా పక్కా..!

నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో లంచావతారాలు
ఉద్యోగులకు లేని రోగాలు ఉన్నట్లు సృష్టించి ధ్రువపత్రాల జారీ
దళారుల సాయంతో అక్రమ దందా
మనిషిని చూడకుండానే పత్రాలు అందజేత


అదో ప్రభుత్వ వైద్యశాల.. జిల్లాలో పల్నాడు ప్రాంతానికి ఆయువుపట్టు.. అక్కడ లంచావతారాలెత్తిన అధికారులదే హవా.. అక్రమ సర్టిఫికెట్లకు వాళ్లు కేరాఫ్‌ అడ్రస్‌.. వారికి డబ్బులిస్తే చాలు.. మనిషిని కూడా చూడకుండా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేంత ఘనులు.. వారి వద్ద ఎప్పుడూ ‘జీ.. హుజూర్‌..!’ అంటూ దళారులు. ప్రతి పనినీ చాకచక్యంగా చేసిపెట్టడం వారి ప్రత్యేకత. సొంత పనులు చూసుకుని.. అసలు పనిని పక్కన పెట్టే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫినెస్‌ సర్టిఫికెట్లు అందజేయడం వీళ్ల పని. సర్టిఫికెట్‌ను బట్టి రేటు కట్టి.. ఉద్యోగి అవసరాన్ని బట్టి ధర మార్చి డబ్బు పోగుచేసుకోవడంలో వాళ్లకు వాళ్లే సాటి..! – నరసరావుపేట టౌన్‌

నరసరావుపేట : వైద్యశాలలో రోగులకు వైద్యసేవలు అందించాల్సిన అధికార సిబ్బంది అక్రమ దందాకు తెరతీశారు. ఏం చేసినా అడిగేవారు లేరనే ధైర్యంతో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. అలాంటి అక్రమ దందాకు నరసరావుపేట ఏరియా వైద్యశాల వేదికైంది. ఉద్యోగులు కోరిన రీతిలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇస్తూ రూ. వేలల్లో డబ్బు దండుకుంటూ వైద్యాధికారులు పబ్బం గడుపుకొంటున్నారు. ఈ వ్యవహారంలో దళారులదే కీలక పాత్ర. వారు చెప్పిందే శాసనంగా మారింది. ధ్రువపత్రం కావాల్సిన ఉద్యోగి లేకుండానే అతని పేరిట సర్టిఫికెట్‌ అందుతుందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఉద్యోగులు అనారోగ్యం పాలైతే తిరిగి ఉద్యోగంలో చేరడానికి  యాజమాన్యాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. అలాంటివారికి ఫిటెనెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వడం సబబు. అయితే.. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సొంత పనుల కోసం విధులకు హాజరు కాకుండా రోజుల తరబడి గడిపి విధుల్లో చేరాలంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ధ్రువపత్రం తప్పనిసరి. అలాంటి వారిని గుర్తించి దళారులు చక్రం తిప్పుతున్నారు. వేలకు వేలు డబ్బులు దండుకొని ఉద్యోగులకు ఏదో ఒక జబ్బు ఉన్నట్లు చిత్రీకరించడం లేదా సదరు ఉద్యోగులు ఫిట్‌గా ఉన్నారని సర్టిఫికెట్లు ఇవ్వడం ఆస్పత్రిలో నిత్య కృత్యంగా మారింది.

కనీస విచారణ కూడా లేదు..
డబ్బు ముట్టజెప్తే ఎలాంటి సర్టిఫికెట్‌ ఇవ్వడానికైనా వైద్యాధికారులు సిద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా దళారులను కూడా నియమించడం విశేషం. పత్రాలు అవసరమైన వారు దళారుల సాయంతో సర్టిఫికెట్లు పొందుతున్నారు. సదరు వైద్యులు కనీస విచారణ కూడా లేకుండా సంతకాలు పెట్టి పంపడం గమనార్హం. కొందరి పేర్లను కనీసం ఓపీలో కూడా రాయకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారంటే అధికారుల ధనార్జన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ, రైల్వేశాఖ, ఎక్సైజ్‌ శాఖ, పోలీస్‌ శాఖలకు చెందిన ఉద్యోగులు ఎక్కువశాతం ఫిట్‌¯నెస్‌లు కోరుతుండటంతో అక్రమార్కుల దందా మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. నెలలో కనీసం 30 నుంచి 40 మంది ఇలా అక్రమంగా సర్టిఫికెట్లు పొందుతారని ఓ అంచనా.

గతంలోనూ విమర్శలు..
అధికార పార్టీ అండదండలతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నెలక్రితం  నిబంధనలకు విరుద్ధంగా ఔషధాల దహనం చేసిన అధికారులు నిన్నామొన్న రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ విమర్శలపాలయ్యారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అక్రమ పద్ధతిలో ధ్రువపత్రాలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇదంతా పల్నాడు ప్రాంతానికే తలమానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో జరగడం గమనార్హం.

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ...
ఏరియా వైద్యశాలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతోనే ఈ పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతో శిశుమరణాలు సంభవించినా, రోగులకు బయట మందులు, స్కానింగ్‌ పరీక్షలు రాసినా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. వైద్యశాలలో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో వరుస కథనాలు వచ్చినప్పటికీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యరంగంపై దృష్టి సారించిన కలెక్టర్‌ వైద్యశాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.  

అంతా దళారులదే హవా...
వైద్యశాలలో ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా దళారులను ఆశ్రయించాల్సిందే. ఒక్కో సర్టిఫికెట్‌కు ఒక్కో ధర నిర్ణయించి ఇక్కడి సిబ్బంది పనులు చక్కబెడుతుంటారు.  వివరాలు ఇస్తే మనిషితో కూడా పని లేకుండా సర్టిఫికెట్‌ నిమిషాల్లో సిద్ధమవుతుంది. ఒక్కో సర్టిఫికెట్‌కు ఇచ్చే రోజుల కాలవ్యవధిని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి రోగిని పరీక్షించిన అనంతరం డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉండగా అసలు రోగిని పరీక్షించకుండానే వైద్యులు సర్టిఫికెట్‌ ఇవ్వడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు