సర్కారు భూ దందా

25 Aug, 2016 00:04 IST|Sakshi
సర్కారు భూ దందా

గిరిజనుల భూములను బలవంతంగా లాక్కున్న  ప్రభుత్వం
నోటీసులు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండానే స్వాధీనం
కోర్టుకు సైతం తప్పుడు నివేదిక
బాధితుల తరఫున వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్‌ సిద్దారెడ్డి న్యాయ పోరాటం


గిరిజనుల భూములను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారికి కనీసం నోటీసులు ఇవ్వకుండా,  రూపాయి కూడా పరిహారం చెల్లించకుండానే మొత్తం 1,146 ఎకరాలను స్వాధీనం చేసుకుని.. అటవీ శాఖకు అప్పగించింది. అయితే.. తాము ఆ భూములను ఇంకా అటవీ శాఖకు అప్పగించలేదని, ఇప్పటికీ గిరిజనులే సాగు చేస్తున్నారంటూ తలుపుల మండల రెవెన్యూ అధికారులు  హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా నివేదిక సమర్పించారు. వాస్తవానికి ఆ భూముల్లో అటవీ శాఖ ఇప్పటికే మొక్కలు నాటింది.  


తలుపుల మండలం ఈదులకుంట్లపల్లి పంచాయతీ పరిధిలోని మడుగుతండా, చంద్రానాయక్‌ తండాకు చెందిన వందలాది మంది గిరిజనులు కొన్నేళ్లుగా అక్కడి భూములను సాగు చేస్తుండేవారు. కొందరు వర్షాధార పంటగా వేరుశనగ, కంది వేసేవారు. మరికొందరు బోర్లు వేసుకొని ఇందిర జలప్రభ ద్వారా మామిడి, సపోట, నేరేడు వంటి పండ్లమొక్కలు కూడా పెట్టారు. చాలామంది పట్టా కూడా పొందారు. ప్రభుత్వం ప్రజావసరాల నిమిత్తం ప్రజల నుంచి భూములను తీసుకోవాలంటే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. 


నయాపైసా  చెల్లించకుండానే, భూమికి బదులు భూమి ఇవ్వకుండానే బలవంతంగా లాగేసుకుంది.జిల్లాలోని లక్ష్మీపురం–భూపసముద్రం రహదారితో పాటు హంద్రీ–నీవా కాలువ నిర్మాణం వల్ల అటవీ శాఖ కొన్ని భూములను కోల్పోయింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గిరిజనులు సాగు చేసుకుంటున్న సర్వే నంబర్‌ 2422లోని మొత్తం 1,146 ఎకరాలను అప్పగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ 2011 ఫిబ్రవరి 9న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే..అటవీ శాఖ అధికారులు ఇటీవలే ఆ భూముల్లోకి వెళ్లి.. మొక్కలు నాటారు.


కనీసం నోటీసులు ఇవ్వకుండా, పరిహారం కూడా చెల్లించకుండానే భూములను స్వాధీనం చేసుకోవడంతో గిరిజన రైతులు కంగుతిన్నారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆ గ్రామ సర్పంచ్‌ భర్త మధుసూదన్‌రెడ్డిని సంప్రదించగా.. ఆయన అదే పార్టీకి చెందిన ఆ మండల నేత పూల శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. ఆయన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సిద్ధారెడ్డి వెంటనే స్పందించి బాధితుల తరఫున హైకోర్టులో పిటిషన్‌ (నెం.25231 ఆఫ్‌ 2016) దాఖలు చేశారు.  రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్, ఎఫ్‌ఆర్‌ఓ, కదిరి ఆర్‌డీఓతో పాటు తలుపుల తహశీల్దార్‌ను ప్రతివాదులుగా చేర్చారు.


కోర్టునూ తప్పుదోవ పట్టించిన రెవెన్యూ అధికారులు
ఆ భూములను తాము కాగితం రూపంలోనే అటవీ శాఖకు ఇచ్చామే కానీ, ఇంకా స్వాధీనం చేయలేదంటూ రెవెన్యూ అధికారులు అటవీ శాఖకు తప్పుడు నివేదిక సమర్పించారు. అయితే.. అటవీ అధికారులు ఇప్పటికే  ఆ భూముల్లో వేప, తపసి, మర్రి, అల్లనేరేడు, రావి వంటి మొక్కలు నాటించారు. తమకు రెవెన్యూశాఖ అధికారులు అప్పగించడంతోనే  మొక్కలు నాటుతున్నామని వారు చెబుతున్నారు.

రెవెన్యూ మాయాజాలం
మడుగుతండా, చంద్రానాయక్‌ తండా  గిరిజనులు ఆయాగ్రామాల పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలో భూములు చదును చేసి ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే రెవెన్యూ అధికారులు భూ పంపిణీ సమయంలో వారు సాగు చేసుకుంటున్న చోట కాకుండా వేర్వేరు సర్వే నంబర్లు కేటాయించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూములతో మీకు సంబంధం లేదనేలా మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు.

బాధితులకు న్యాయం
జరిగే వరకు పోరాటం
నష్టపరిహారం చెల్లించకుండా  గిరిజనుల భూములు లాక్కోవడం ఆర్టికల్‌ 14, 21 అండ్‌ 300ఏ ప్రకారం నేరమవుతుంది. ఇప్పటికే వారి తరఫున కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశా. కోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా రెవెన్యూ అధికారులు సమాధానమిచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున  పోరాటం చేస్తా.  
–డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి,  కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త

>
మరిన్ని వార్తలు