మూడో‘సారీ సగమే’..!

26 Jun, 2016 02:41 IST|Sakshi
మూడో‘సారీ సగమే’..!

రుణమాఫీలో జిల్లాకు రావాల్సింది రూ.409 కోట్లు..
మంజూరు అయింది రూ.204.50 కోట్లు
ఒకేసారి మాఫీ చేయాలంటున్న రైతులు
పట్టించుకోని ప్రభుత్వం

‘విడతలవారీ’తో ఇబ్బంది..
బ్యాంకు నుంచి నేను గతంలో రూ.90వేలు అప్పు తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పటికీ రెండుసార్లు మాత్రమే రుణమాఫీ వచ్చింది. మొదటి విడతలో రూ.27,500 రుణమాఫీ వచ్చింది. రెండోసారి వడ్డీ పోగా.. రూ.22వేలు ఇచ్చారు. తర్వాత వడ్డీ డబ్బులు బ్యాంకులో పడ్డాయన్నారు. అవి వచ్చాయో రాలేదో తెలియదు. విత్తనాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండెకరాల్లో పత్తి పంట, మూడెకరాల్లో పెసర పంట సాగు చేశా. విడతలవారీగా రుణమాఫీ ఇవ్వడంతో రైతులకు అప్పు తప్ప ఏమీ మిగిలే పరిస్థితి లేకుండాపోతుంది. ప్రభుత్వం మిగిలిన రెండు విడతల రుణమాఫీని చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలి.
- తోట శ్రీను, రైతు, బచ్చోడు, తిరుమలాయపాలెం మండలం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం చెప్పేదానికి.. చేసేదానికి పొంతన ఉండటం లేదు. రుణమాఫీని ఏటా విడతలవారీగా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. సగానికి కోత పెడుతోంది. మూడో విడత మంజూరులోనూ సగం మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విడతలో జిల్లాకు రూ.409కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉండగా.. ఇప్పుడు 204.50కోట్లు మాత్రమే మంజూరవుతున్నాయి. రుణమాఫీ ఒకేసారి చేస్తే బాగుంటుందని రైతుల నుంచి డిమాండ్ వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో రుణమాఫీ కింద 3.80లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు.

విడతలవారీగా రూ.1711కోట్లు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.409కోట్ల చొప్పున విడతలవారీగా ఈ మొత్తం అంతా విడుదల చేయాలి. కానీ.. ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.818కోట్లు మంజూరు చేసింది. మూడో విడతలో రూ.409కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా.. ఇందులో సగానికి ప్రభుత్వం కోత పెట్టింది. దీంతో ఈ ఏడాది మూడో విడతలో రూ.204.50కోట్లు మాత్రమే రుణమాఫీ కానుంది. ప్రభుత్వం మంజూరు చేసినట్లు ప్రకటిస్తున్నా.. రైతులకు రుణాలు మాఫీ కావడానికి ఏడాది పడుతోంది. రుణమాఫీ డబ్బులకు కూడా బ్యాంకుల్లో వడ్డీ వసూలు చేస్తున్నారని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఏకమొత్తంలో ఒకేసారి ప్రభుత్వం మంజూరు చేస్తే వడ్డీ తక్కువ పడుతుందని, ఇలా విడతలవారీగా చేయడం వల్ల వడ్డీనే రూ.వేల చొప్పున చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

దీనిపై పలుమార్లు అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఖరీఫ్, రబీకి సంబంధించి బ్యాంకర్లు రుణాల లక్ష్యం నిర్దేశించినట్లు పేర్కొంటున్నా.. రైతులు మాత్రం రుణాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్, రబీకి రూ.2,600కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు రుణాల మంజూరులో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒకేసారి రుణమాఫీ కాకపోవడం, సీజన్‌కు తగ్గట్లుగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి మరీ పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. మూడోసారి రుణమాఫీలో కూడా సగమే ఇవ్వడంతో దీనికి వడ్డీనే వేలకు వేలు పోతుందని, మళ్లీ ఇందులో మొత్తం ఎప్పుడు విడుదలవుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.

 ఇంకా కావాల్సింది రూ.688.50 కోట్లు
రుణమాఫీలో భాగంగా రూ.1711కోట్లలో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,022.50కోట్లు విడతలవారీగా మంజూరు చేసింది. ఇంకా రూ.688.50కోట్లు మంజూరు కావాల్సి ఉంది. ఇవి ఇచ్చే మొత్తంలోనూ సగం ఇస్తే వడ్డీకే పోతుందని రైతులు వాపోతున్నారు. ఈసారి జిల్లాకు రూ.409కోట్లు వస్తాయని భావించినా.. ఇందులోనూ సగం కోత పెట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే బ్యాంకులు వడ్డీ వసూలు చేసే పరిస్థితి ఉండదని రైతులు పేర్కొంటున్నారు.

 వడ్డీ వసూలు చేస్తున్నరు..
రూ.లక్షలోపు రుణం పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. వెంటనే మాట మార్చి విడతలవారీగా రుణమాఫీ అనడంతో.. బ్యాంకోళ్లు మిగిలిన రుణానికి వడ్డీ వసూలు చేస్తున్నారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయాలి. నాకున్న మూడెకరాలకు బ్యాంకులో రూ.60వేలు పంట రుణం తీసుకున్నా. ప్రభుత్వం రుణమాఫీ పథకం వర్తింపజేయడంతో.. మొదటి, రెండో దఫాగా రూ.30వేలు మాఫీ చేసింది. రుణమాఫీ సంపూర్ణంగా చేయకపోవడంతో.. మిగిలిన రుణానికి బ్యాంకోళ్లు ఏడాది వడ్డీ వేశారు. ప్రభుత్వం వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నా.. బ్యాంకోళ్లు వడ్డీ చెల్లించాల్సిందేనని, మిగిలిన రుణ పైకానికి రెన్యూవల్ చేసుకోవాలని ఒత్తిడి తె స్తున్నారు.
- ఇమ్మడి వెంకటేశ్వర్లు, కారేపల్లి

మరిన్ని వార్తలు