చెప్పిందొకటి, చేస్తోంది మరొకటి

12 Jan, 2016 10:34 IST|Sakshi
చెప్పిందొకటి, చేస్తోంది మరొకటి
పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు కుటుంబానికి అన్యాయం
అప్పట్లో ఐదెకరాలు ఇస్తామని, ఇప్పుడు రెండెకరాలు ఇచ్చిన ప్రభుత్వం
అధికారులను నిలదీసిన మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ
 
సంగం: ఖండాంతరాల్లో భారత కీర్తిపతాకను రెపరెపలాడించిన ప్రముఖ పర్వతారోహకుడు, దివంగత మల్లిమస్తాన్‌బాబు కుంటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మస్తాన్‌బాబు మృతి చెందినపుడు ఆయన తల్లి సుబ్బమ్మకు ఐదు ఎకరాల సాగుభూమి ఇస్తామని అప్పట్లో రాష్ట్ర మంత్రులు, అధికారులు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తీరా ఇప్పుడు రెండెకరాలు ఇస్తున్నామని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో సోమవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులు ప్రకటించారు. దీనిపై మస్తాన్‌బాబు తల్లి ఆవేదన చెందారు.
 
తన కుమారుడు మస్తాన్‌బాబు మృతి చెందినపుడు రాష్ట్ర మంత్రులు, అధికారులు తనకు ఐదెకరాలు సాగుభూమి, రూ. 10 వేల పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు రెండెకరాలు ఇవ్వడం ఏమిటని జన్మభూమిలో అధికారులను ఆమె నిలదీశారు. అప్పుడు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తుందేమిటి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

కాగా రెండెకరాల భూమిని సుబ్బమ్మకు ఇస్తున్నట్లు సభలో పట్టాను చూపిన తహశీల్దార్.. ఆమెకు మాత్రం పట్టా అందజేయలేదు. ఆర్డీవో ఎంవీ రమణ ద్వారా పట్టా ఇప్పిస్తామని తొలుత అధికారులు తెలిపారు. ఆర్డీవో సభకు రాకపోవడంతో పట్టాను ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకున్నారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లి సుబ్బమ్మకు పట్టా ఇచ్చే విషయంలో కూడా అధికారులు ప్రచారం కోరుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. 
 
మరిన్ని వార్తలు