అధికార‘పంచాయితీ’

22 Sep, 2016 00:02 IST|Sakshi
అధికార‘పంచాయితీ’

–టీడీపీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న
  జిల్లా కీలక ఉన్నతాధికారి
–పార్టీ పంచాయతీలకు వేదికైన కార్యాలయం
–అసమ్మతి నేతలకు బుజ్జగింపూ అక్కడే
–సర్వత్రా విమర్శల పాలవుతున్న తీరు
ప్రజా సేవ చేయాల్సిన ఉన్నతాధికారి అధికారపార్టీ వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. రాజకీయపరంగా పాలకపక్షానికి తమ వంతు సాయమందిస్తున్నారు. ఆఖరుకు పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఏర్పడిందని జిల్లాలో  చర్చించుకుంటున్నారు. అధికార టీడీపీ చేతుల్లో పావులుగా మారిన తీరు  చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రజాసేవకు అంకితమవుతామని ప్రమాణం చేసి వచ్చి అధికారపక్ష సేవలో తరించడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, చిత్తూరు:
 రాజకీయాలకు అతీతంగా పని చేస్తూ..ప్రజల మన్ననలు పొందాల్సిన అధికారులు అధికారంలో ఉండేపార్టీలకు కొమ్ము కాస్తున్నారు. తుదకు అధికార పార్టీ నాయకుల్లో విభేదాలు తలెత్తినా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లోనే అధికారులు చక్కబెడుతున్నారు. అధికార పెద్దలకు నివేదికలు పంపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బుజ్జగింపుల పర్వం కేవలం మండలస్థాయిలో అనుకుంటే పొరబడినట్లే. జిల్లా పాలనలో కీలక భూమిక వహించే ఉన్నత స్థాయి అధికారి నేతృత్వాన జరగడం విశేషం.
ఇవికో మచ్చుకు కొన్ని
– కుప్పం పంచాయితీలో ఇటీవల టీడీపీలో కొందరు వార్డు సభ్యులు రాజీనామా చేసి సంక్షోభం సృష్టించారు. అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. వీరిని బుజ్జగించి దారికి తెచ్చే బాధ్యతను జిల్లా కీలక ఉన్నతాధికారి భుజాన వేసుకున్నారు. ఈ పంచాయతీని సమర్ధంగా నిర్వహించి వారిలో అసమ్మతిని చల్లార్చారు. పంచాయతీ అభివృద్ధి నామమాత్రంగా ఉందంటూ గోడు చెప్పుకొందామని కార్యాలయానికి వచ్చిన వార్డు సభ్యులకు సదరు అధికారి క్లాసు పీకారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చొద్దంటూ సలహా ఇచ్చారు.
 – జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ,అటవీ శాఖ మంత్రి బోజ్జల, హౌసింగ్‌ చైర్మన్‌ వర్ల రామయ్యలు ఏకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలను నేరుగా జిల్లా కీలక ఉన్నతాధికారి కార్యాలయానికి తీసుకొచ్చారు. మంతనాలు జరిపారు. టీడీపీ నాయకులకు అధికారులు అనుగుణంగా నడచుకోవాలని హుకుం జారీ చేశారు. ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరగాలని అనధికార ఆదేశాలు జారీ చేశారు. ఈ తతంగం ఆ పాలనాధికారి సమక్షంలోనే జరగడం గమనార్హం.
– మాజీ మంత్రి  ముద్దుకృష్ణమ నాయుడు ఎమ్మెల్సీ అయిన వెంటనే మంత్రి బొజ్జల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు, ఎంపీ శివప్రసాద్‌ తదితరులు రాజకీయ సమావేశం సదరు కీలక ఉన్నత అధికారి చాంబరులోనే నిర్వహించారు. ఇది ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటైన సమావేశం అనుకుంటే పొరపాటు. నీరు–చెట్టు, ఇతర నామినేషన్‌ పనులను టీడీపీ కార్యకర్తలకే ఇవ్వాలని అ ఉన్నతాధికారికి చెప్పారు. వారి ఆదేశాల ప్రకారం చాలా వరకు పనులు అధికార పార్టీ కార్యకర్తలకే పనులు కేటాయిస్తున్నారు.
– కొన్ని రోజుల క్రితం చిత్తూరు మేయర్‌ కుర్చీపై టీడీపీ నాయకులతో అర్ధరాత్రివరకు సమావేశం నిర్వహించారు. టీడీపీలో ఉన్న రెండు వర్గాలను పిలిపించుకొని అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నించారు. కుమ్ములాడుకుంటుంటే పార్టీ పరువు పోతుందని సదరు ఉన్నతాధికారి స్వయంగా వ్యాఖ్యానించారని సమాచారం.
 

మరిన్ని వార్తలు