'పదవి కోసం అడగని హామీలు కూడా ఇచ్చారు'

5 Jun, 2016 20:04 IST|Sakshi

ద్వారకాతిరుమల: కాపులకు రుణాలిచ్చామని ఆర్భాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అర్హులైన వారికి ఎందరికి రుణాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఆదివారం నిర్వహించిన కాపునాడు కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో గడపగడపకూ వెళ్లి కాపులకు హామీలు ఇచ్చింది చంద్రబాబేనన్నారు. సీఎం పదవి కోసం కాపులకు అడగని హామీలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు.

రెండేళ్లు దాటినా ఆ హామీల్ని నెరవేర్చకపోగా ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణంగానే కాపులంతా ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై డిసెంబర్ నెలాఖరు నాటికి స్పష్టత ఇవ్వాలని, లేదంటే కార్యాచరణ రూపొందించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి ఇతర కులాలకు చెందిన అధికారులను ఎందుకు తీసుకురాలేదని ముద్రగడ నిలదీశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన అధికారుల పూర్తి వివరాలు తెలియజేయాలని కోరారు.

 

మరిన్ని వార్తలు