సుమధురం..గోవిందుడి నామస్మరణం

9 Jan, 2017 21:31 IST|Sakshi
శ్రీవారికి హారతులు పడుతున్న పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు
- శ్రీవారికి దివిటి సేవ గావించిన పీఠాధిపతి
- వైకుంఠ ద్వార ప్రవేశంలో
  ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి
- ఆకట్టుకున్న పూలంకరణ, భజన కీర్తనలు
 
మంత్రాలయం :  పుష్పతోరణ పరిమళాలు.. మంగళవాయిద్యాల సుస్వరాలు.. దాససాహిత్య మహిళల భజన కీర్తనలు.. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సోమవారం భక్తులు గోవిందుడి నామస్మరణలో తరించారు. మంత్రాలయం నడిబొడ్డున శ్రీరాఘవేంద్రస్వామి చేతుల మీదుగా ప్రతిష్టితమైన శ్రీవేంకటేశ్వరుడి సన్నిధానంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. శ్రీమఠం పంచాంగం రీత్యా సోమవారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో శ్రీవారికి విశేషపూజలు, దివిటీసేవ, ప్రత్యేక మంగళహారతులు గావించారు. అనంతరం వైకుంఠ ద్వారానికి హారతులు పట్టి ఉత్తరదిశ ముఖస్థితులైన వేంకటనాథుడు, నైరుతిభాగంలో కొలువుదీరిన పద్మావతికి పూజలు చేశారు. అనంతరం వైకుంఠ ఏకాదశి విశిష్టతను పీఠాధిపతి భక్తులకు ప్రవచించారు. గురుసార్వభౌమ దాససాహిత్య అకాడమీ మహిళలలు ఆలపించిన భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మేనేజర్‌ శ్రీనివాసరావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, ఆలయ పూజారి మదుప్రసాద్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. 
 
శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠ మార్గ ప్రవేశం చేసి వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే కూతురు ప్రియాంక, వైఎస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కృష్ణస్వామి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు