విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న సర్కారు

29 Jul, 2016 17:03 IST|Sakshi
విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న సర్కారు

మాజీ హోంమంత్రి సబితారెడ్డి

శంషాబాద్‌ : విద్యావ్యవస్థను రాష్ట్ర సర్కారు భ్రష్టు పట్టిస్తోందని మాజీ హోంమంత్రి సబితారెడ్డి విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఎంసెట్‌-2 పరీక్షా తీరుకు నిరసనగా శుక్రవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శంషాబాద్‌ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఉన్నత విద్యనందించేందుకు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో సమర్థవంతంగా అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఇప్పుడు రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఫాంహౌస్‌కే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో అత్యున్నతమైన ఎంసెట్‌ పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని స్థాయిలో ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు.

            విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో చదువులు పూర్తయినా సర్టిఫికెట్లు అందుకోలేని దుస్థితి కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో వర్సిటీల పాలన కూడా గాడి తప్పిందని ఆమె విమర్శించారు. విద్యార్థులకు అండగా ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చలగాటమాడుతున్న ప్రభుత్వానికి భవిష్యత్తులో విద్యార్థులే బుద్ధి చెప్పాలని యువనేత కార్తీక్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌, కవితలకు రూ.కోట్లు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్‌ విద్యార్థులకు సంబంధించిన ఫీజులు విడుదల చేయడానికి మాత్రం వెనుకాడుతున్నారన్నారు. కార్యక్రమంలో శంషాబాద్‌ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య,  జెడ్పీటీసీ సభ్యుడు సతీష్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రావణ్‌గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగౌడ్‌, శంషాబాద్‌ సర్పంచ్ సిద్ధేశ్వర్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాగర్‌, యూత్‌కాంగ్రెస్‌ నాయకులు వంశీ, శ్రావణ్‌గౌడ్‌, పవిత్ర సాగర్, రాఘవేందరెడ్డి  వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు