మహిళలపై దాడులు అరికట్టడంలో విఫలం

3 Mar, 2017 23:07 IST|Sakshi
మహిళలపై దాడులు అరికట్టడంలో విఫలం
 
  ప్రగతిశీల మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌.విష్ణుమ్మ
 
తెనాలిటౌన్‌: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రగతిశీల మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌.విష్ణుమ్మ విమర్శించారు.  మహిళల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా 
రూరల్‌ మండలం కఠెవరంలోని మహిళ సంఘం కార్యాలయంలో శుక్రవారం   సదస్సు ఏర్పాటు చేశారు.  విష్ణుమ్మ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మద్యం షాపులు తొలగిస్తామని   ఎన్నికల సమయంలో   చెప్పిన చంద్రబాబు    అధికారంలోకి వచ్చాకా గ్రామీణ ప్రాంతాల్లో వీధికో మద్యం షాపునకు లైసెన్స్‌ ఇచ్చి మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళ సాధికారత పేరుతో మహిళలను మోసం చేస్తున్నారన్నారు.  మార్చి 8వ తేదీ మహిళ దినోత్సవాన్ని శ్రామిక మహిళ పోరాట దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చారు. 
 మహిళా సంఘం జిల్లా కార్యదర్శి శీలం ఏసమ్మ మాట్లాడుతూ   మహిళలకు సమాన హక్కులు కల్పించి అన్ని రంగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని   డిమాండ్‌ చేశారు. సదస్సులో  డి.శివపార్వతి, కృష్ణావేణి, రమణమ్మ, సుబ్బలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు