నగరంలో సంపన్నుల కక్కుర్తి బయటపడింది

25 Aug, 2016 23:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూర్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో సంపన్నుల కక్కుర్తి బయటపడింది. సొంత ఇల్లు, కారు ఉన్నవారు, బడా వ్యాపారులు కూడా ఆహార భద్రత కార్డులు పొందినట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. తాజాగా కుటుంబ సమగ్ర సర్వే వివరాలతో ఆహార భద్రత కార్డుల లబ్ధిదారుల ఆధార్‌ను అనుసంధానం చేయడంతో వారి చిట్టా వెలుగు చూసింది.

మరోవైపు ఆస్తి పన్నుతో సైతం లబ్ధిదారుల ఆధార్‌ నంబర్‌ను పరిశీలిస్తున్నారు. నెల రోజుల నుంచి జరుగుతున్న పరిశీలనలో సుమారు 1.20 లక్షల కార్డుదారులు ఉన్నట్లు గుర్తించారు. అందులో హైదరాబాద్‌ పౌరసరఫరాల విభాగం పరిధిలో సుమారు సుమారు 70 వేల కార్డుదారులు, శివారులోని రంగారెడ్డి జిల్లా అర్బన్‌ పరిధిలో సుమారు 50  వేల కార్డులు ఉన్నాయి.

దిద్దుబాటు........
పౌరసరఫరాల శాఖ తప్పుల దిద్దుబాటులో పడినట్లు కనిపిస్తోంది. తెల్లరేషన్‌ కార్డులను రద్దు చేసిన ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఆధార్‌ ఆధారంగా అడ్డగోలుగా ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఆయితే సంఖ్యకు మించి కార్డులు జారీ కావడంతో వడపోత ప్రారంభించింది.

గత ఆరు నెలలుగా కేటగిరి వారీగా పరిశీలిస్తూ అనర్హుల ఏరివేత కొనసాగిస్తోంది.  తాజాగా సొంత కారు, ఇల్లు, వ్యాపారం కలిగిన కుటుంబాలను అనర్హులుగా గుర్తిస్తూ వారి కార్డుల రద్దుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 80 శాతం పైగా వడపోత పూర్తయిందని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు