సర్కారీ దవాఖానాకు సుస్తీ

24 Aug, 2016 22:31 IST|Sakshi
సర్కారీ దవాఖానాకు సుస్తీ

–పనిచెయ్యని ఎక్స్‌రే యత్రం
–మూలకుపడ్డ బయోమెట్రిక్‌
–శుద్దిజలయంత్రం పరిస్ధితి కూడ అంతే
–సాయంత్రమైతే ఒక్కరు ఉండరూ..
కోదాడ: పట్టణంలోని సర్కారీ వైద్యశాలకు అసౌకర్యాల సుస్తీ చేసింది. బాగు చెయాల్సిన ఉన్నతాధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతినెలా లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నా ఇక్కడ పేద రోగులకు కనీస వైద్యసౌకర్యాలు అందడం లేదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం దాటితే ఇద్దరు నర్సులు తప్ప ఒక్క వైద్యుడు కూడా ఇక్కడ అందుబాటులో ఉండరు. 30 పడకల వైద్యశాలలో 8 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ఇక్కడ ప్రస్తుతం ఇద్దరు మహిళా వైద్యులు మాత్రమే ఉన్నారు. ఒక్కరు ఖమ్మం నుంచి రోజు వచ్చి వెళతారు. మరొకరు కోదాడలో ఉన్నప్పటికి  మధ్యాహ్నం తరువాత అందుబాటులో లేకుండా వెలుతుండడంతో వైద్యశాలకు వచ్చేవారికి నర్సులే చికిత్స చేస్తారు. ఇక రాత్రి పూట రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైనా వస్తే వైద్యులు లేక సిబ్బంది ‘ కండీషన్‌ సీరియస్‌ షిప్ట్‌ ఇమిడియట్లీ’ అంటూ ప్రైవేట్‌ వైద్యశాలలకు పంపడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఇక డెలవరీ కోసం వైద్యశాలలో చేరిన వారికి రాత్రి పూట నొప్పులు వస్తే డాక్టర్లు అందుబాటులో లేక పోవడంతో 108కి ఫోన్‌ చేసి ఖమ్మం తరలిస్తున్నారు.
ఇక్కడ ఏవి పనిచెయవు..
వైద్యశాలలో ఉన్న సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సమయ పాలన మర్చిపోయారని రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  నిత్యం వైద్యం కోసం వచ్చేవారు స్థానికంగా వైద్యులు లేక పోవడంతో నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. ఇది పెద్ద తలకాయనొప్పి వ్యవహారం కావడంతో అధికారులు బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పని సరి చేశారు. కానీ అది ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే అవి పనిచెయకుండా పోయాయి. దీంతో బయోమెట్రిక్‌ విధానం అటకెక్కింది. కొందరు సిబ్బందే కావాలని వాటిని పాడుచేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఇక వైద్యశాలలో ఉన్న ఎక్స్‌రే యంత్రం పనిచెయక రెండు సంవత్సరాలు కావస్తుంది. దానిని బాగుచేసేవారే కరువయ్యారు. ఇక వైద్యశాలలో ఉన్న శుద్ధిజలయంత్రం కూడా ఏర్పాటు చేసిన కొద్దిరోజులకే మూలపడింది.
సమావేశం జరిపే తీరికేది...
వైద్యశాలకు సలహాసంఘం ఉంది. స్థానిక ఎమ్మెల్యే దీనికి చైర్మన్‌గా ఉంటారు. ఐదుమండలాల ఎంపీపీలు, కోదాడ మున్సిపల్‌ చైర్మన్‌తో పాటు సామాజిక కార్యకర్తలు, జిల్లా కోఆర్డినేటర్‌ దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వీరు సమావేశమై వైద్యశాల స్థితిగతులపై చర్చించి పేదలకు మెరుగైన సేవలందిచేందుకు తగు చర్యలు తీసుకోవాలి. కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. ఆపరేషన్ల కోసం పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఇక్కడ నిత్యం గొడవ జరుగుతున్నా, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా కనీస చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు