ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలకు నీటి కష్టం

30 Aug, 2016 22:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల నియోజకవర్గంలోని 110 గ్రామాలకు తాగునీరు అందించే సీపీడబ్లు్య స్కీం నిర్వహణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. వాల్వ్‌ ఆపరేటర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో గత 15 రోజులుగా సమ్మెలో ఉన్నారు. తద్వారా ప్రజానీకం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రత్యక్ష పోరుబాట పట్టారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జవహర్‌రెడ్డి, కలెక్టర్‌ కేవీ సత్యనారాయణతో ఫోన్‌లో చర్చించారు. ఎట్టకేలకు సానుకూలత వ్యక్తమైంది. రెండు రోజులల్లో నిధులు సర్దుబాటు చేసేందుకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. పార్నపల్లె బృహత్తర నీటి పథకం ద్వారా పులివెందుల మున్సిపాలిటీతోపాటు రూరల్, లింగాల, సింహాద్రిపురం, తొండూరు మండలాల్లోని 110 గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. 42మంది వాల్వ్‌ఆపరేటర్ల అందులో పనిచేస్తున్నారు. 2015 జూలై నుంచి వారందరికీ జీతాలు అందలేదు. దీంతో ఈనెల 15 నుంచి వాల్వ్‌ ఆపరేటర్లు సమ్మెబాట పట్టారు. దాంతో గత 15 రోజులుగా తాగునీరు సరఫరా కాలేదు. నాలుగు మండలాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చెల్లించేంతవరకూ తాగునీరు సరఫరా చేయలేమని ఆపరేటర్లు తెVó సి చెప్పడంతో సమస్య జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మంగళవారం ఆర్‌డబ్లు్యఎస్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
మంత్రి అయ్యన్నతో చర్చలు
110 గ్రామాలకు తాగునీరు అందించే సీపీడబ్ల్యూ స్కీం వాల్వ్‌ ఆపరేటర్ల సమ్మె, ప్రజల ఇక్కట్లపై మంత్రి అయ్యన్నపాత్రుడుతో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఫోన్‌లో చర్చించారు. గతంలో ఇలాగే సమ్మె చేయడంతో 3 నెలల జీతం మాత్రమే ఇచ్చారని తర్వాత ఇదే పరిస్థితి నెలకొందని వివరించారు. భుక్తి కోసం ఆపరేటర్లు సమ్మెలోకి వెళ్లగా ప్రజానీకం తాగునీటి కోసం ఆరాట పడాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. తక్షణమే స్పందించి ప్రజలకు తాగునీరు అందించాలని కోరారు. అదే విషయాన్ని ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జవహర్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. దాదాపు రూ.3 కోట్లు బకాయిలు  పెండింగ్‌లో ఉన్న విషయాన్ని వివరించారు. అనంతరం కలెక్టర్‌ కేవీ సత్యనారాయణతో ఫోన్‌లో చర్చించగా రెండురోజుల్లో సమస్యకు పరిష్కారం చూపగలమని తెలిపారు. జీతాల నిమిత్తం నిధులు సర్దుబాబు చేయగలమని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి హామీ ఇచ్చారు. నిరసన కార్యక్రమం విరమించాలని ప్రజలకు తాగునీరు సరఫరా చేయించే బాధ్యత తీసుకుంటామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఆ హామీ మేరకు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిరసనను విరమించారు.

మరిన్ని వార్తలు