భూతప్పల కాలి స్పర్శ కోసం.. వేయి కళ్లతో!

26 Dec, 2015 20:00 IST|Sakshi
భూతప్పల కాలి స్పర్శ కోసం.. వేయి కళ్లతో!

వాళ్ల కాలి స్పర్శ తగిలితే చాలు.. సర్వ శుభాలు జరుగుతాయని, వ్యాధులన్నీ నయమవుతాయని నమ్మకం. ఆ కాలి అడుగులు తగలడం కోసం ఉపవాస దీక్షతో.. తడిదుస్తులు ధరించి.. వాళ్లొచ్చే దారిలో ఇలా పడుకుంటారు. ఇదంతా అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరపల్లి ప్రాంతంలో జరిగే భూతప్పల ఉత్సవం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడుకుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా మార్గశిరమాసంలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడకు వచ్చే భూతప్పల కాలి స్పర్శ కోసం వందలాది మంది భక్తులు వేచి చూస్తుంటారు.

భక్తులు బియ్యపుపిండి, బెల్లం కలిపి చలివిడితో హారతులు చేసి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మెక్కులు తీర్చుకుంటారు. హారతుల ఉత్సవం తర్వాత జరగే భూతప్పల ఉత్సవం ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. భూతప్పల కాలి స్పర్శ కోసం వాళ్లు వచ్చే దారిలో ఎంతోమంది భక్తులు ఉపవాస దీక్షతో, తడిబట్టలతో వేచి ఉంటారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వాముల వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఉత్సవ విగ్రహాల ముందు భూతప్పలు కత్తి, డాలు పట్టి విన్యాసాలు చేస్తూ దారివెంట బోర్లాపడుకున్న భక్తులపై నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు.. ఎవరెవరికి వాళ్ల కాలి స్పర్శ తగులుతుందో.. వాళ్లకు సర్వ శుభాలు కలుగుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. ఈ తంతు అనాదిగా ఇక్కడ జరుగుతూనే ఉంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు