ఘనంగా ఆదిశంకరాచార్య జయంత్యుత్సవం

30 Apr, 2017 23:22 IST|Sakshi
ఘనంగా ఆదిశంకరాచార్య జయంత్యుత్సవం
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని ఫాలధార –పంచధారల వద్ద ఆదివారం ఆదిశంకరాచార్యుల జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చతుర్వేద శాస్త్రపురాణ పారాయణలతో జరిగిన పూజల్లో  చంద్రమౌళీశ్వరస్వామికి, శారదాదేవికి,   శంకరాచార్యులకు పంచామృతాభిషేకం, పుణ్యజలాభిషేకం, ప్రత్యేక అర్చనలు చేశారు. శ్రీశైలమహాక్షేత్రానికి ఆదిశంకరాచార్యులకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, క్షేత్రపరిధిలోని పాలధారపంచధారల వద్ద శంకరుల వారు తపస్సు చేసి శివానందలహరి అనే గ్రంథాన్ని రచించినట్లు క్షేత్రసాహిత్యం ద్వారా తెలుస్తుందని వేదపండితులు తెలిపారు. భ్రమరాంబదేవి ఆలయంలో వామాచార (జంతుబలి) సంప్రదాయాన్ని మార్చి దక్షిణాచార (సాత్వికబలి) సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినట్లు, శ్రీచక్రాన్ని అమ్మవారి ఆలయప్రాంగణంలో ప్రతిష్టించారని చెప్పారు. ప్రత్యేక పూజల్లో  శ్రీశైలప్రభ సంపాదకులు డాక్టర్‌ కడప అనిల్‌కుమార్, అర్చకులు, వేదపండితులు వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 
 
పురాణ ప్రవచనం
 శంకర జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీశైలాలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సాయంత్రం 6గంటలకు జరిగిన  పురాణ ప్రవచనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. నంద్యాలకు చెందిన  ప్రముఖ ప్రవాచకులు డి హయగ్రీవాచార్యులు  ఆదిశంకరుల జీవిత విశేషాలను క్షుణ్ణంగా  వివరించారు.  
 
మరిన్ని వార్తలు