వైభవం.. నరసింహుని పవిత్రోత్సవం

13 Oct, 2016 00:13 IST|Sakshi
వైభవం.. నరసింహుని పవిత్రోత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ): ఎగువ అహోబిలం శ్రీజ్వాలనరసింహస్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు   అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.  నాలుగురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు మంగళవారం తెల్లవారు జామున  యాగశాల ప్రవేశం తదితర పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో సోమకుంభస్థాపనం అంకురార్పణం చేశారు. రెండోరోజు బుధవారం ఉదయం నిత్య పూజ, నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ఠ, కుంభ ప్రతిష్ఠ చేశారు.  అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించారు. రాత్రి శ్రీజ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి  గ్రామోత్సవం నిర్వహించారు. 
 
పవిత్రోత్సవ విశిష్టత 
ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక ఉత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలిసీ తెలియక చేసిన తప్పులతో ఏర్పడ్డ దోష నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆనవాయితీగా వస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 
 
పవిత్రోత్సవాల్లో నేడు
పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు నిత్యపూజలు, హోమం, గోష్టి, సాయంత్రం 6 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం, రాత్రి 10 గంటలకు హోమం, 10.30 కు గోష్టి తదితర పూజలు నిర్వహిస్తారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు