గ్రానైట్ బండల కింద పడి ఐదుగురి మృతి

31 Oct, 2015 01:59 IST|Sakshi
గ్రానైట్ బండల కింద పడి ఐదుగురి మృతి

మృతుల్లో నలుగురు కూలీలు.. ప్రకాశం జిల్లా వాసులు
 
 వెంకటాచలం: గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు లారీలో ఎక్కి.. అందులోని గ్రానైట్ బండల కింద పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతుల్లో నలుగురు ప్రకాశం జిల్లా వాసులు ఉన్నారు. బాధితుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం చిన్న డేగర్లమూడికి చెందిన 11 మంది పొగాకు గ్రేడింగ్ పనిచేసే కూలీలు. వీరు మైసూరులోని ఫ్యాక్టరీలో పనికి వెళ్లి తిరిగి తమ గ్రామానికి వెళ్లేందుకు రేణిగుంట వరకు రైల్లో వచ్చారు. అక్కడ నుంచి  బైపాస్ రోడ్డుకు చేరుకొని ఆ మార్గంలో వస్తున్న గ్రానైట్ బండల లోడు లారీ ఎక్కారు. క్యాబిన్‌లో ఐదుగురు, ట్రక్కులో క్యాబిన్‌కు  బండలకు మధ్య ఖాళీలో ఆరుగురు కూర్చున్నారు.

తరువాత నాయుడుపేట వద్ద ఓజిలి మండలం కురుగొండకు చెందిన ముగ్గురు నెల్లూరులో ఓ వివాహానికి వెళ్లేందుకు అదే లారీ ఎక్కి క్యాబిన్‌కు, బండలకు మధ్య కూర్చున్నారు. వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపానికి చేరుకునే సరికి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో లారీ కుదుపునకు గురై గ్రానైట్ బండలు ముందుకు పడిపోయాయి. దీంతో క్యాబిన్‌కు, రాళ్లకు మధ్య కూర్చుని ఉన్న తొమ్మిదిమందిలో డేగర్లమూడికి చెందిన రమాదేవి (45), వీరలక్ష్మి (30), సుబ్బాయమ్మ (30), నాగేంద్రమ్మ (47) దుర్మరణం చెందారు. ఓజిలి మండలం కురుగొండకు చెందిన పుల్లయ్య (47) ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. మిగిలిన వారు గాయపడ్డారు. బాధితుల్ని 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కురుగొండకు చెందిన రమణయ్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు