మున్సిపాలిటీలకు నిధులు మంజూరు

9 Jan, 2017 23:23 IST|Sakshi
  •  14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద మరో రూ.137.28 కోట్లు
  • మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి
  • మడకశిర : మున్సిపల్‌ రీజనల్‌ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న 38 మున్సిపాలిటీలకు నిధులు మంజూరైనట్లు మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి తెలిపారు. 2016 - 17వ ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపాలిటీలకు మంజూరయ్యాయన్నారు. ఆమె సోమవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సబ్‌ప్లాన్‌ నిధుల్లో ఎస్సీల అభివృద్ధికి రూ.77.65 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ.59.63 కోట్లు కేటాయించారన్నారు. 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101.60 కోట్లు, సబ్‌ప్లాన్‌ నిధులు రూ.333.36 కోట్లు కూడా మున్సిపాలిటీలకు వచ్చాయన్నారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలో గత డిసెంబరుకు రూ.212.35 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, రూ.109.84 కోట్లు(52శాతం) మాత్రమే వసూలైనట్లు తెలిపారు. పన్ను వసూళ్లను 75శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రీజనల్‌ పరిధిలోని కర్నూలు, తాడిపత్రి, కడప, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలకు మొదటి విడతలో ఏహెచ్‌పీ కింద రూ.27,900 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా హౌసింగ్‌ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలకు బీఎల్‌సీ కింద 17,470 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 38 మున్సిపాలిటీల పరిధిలో స్వచ్ఛభారత్‌ కింద 56,333 మరుగుదొడ్లను నిర్మించామన్నారు. 162 కమ్యూనిటీ మరుగుదొడ్లను మంజూరు చేశామని, ఇందులో 68 పూర్తి చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 84,677 కుక్కలు ఉంటే అందులో 42,247 కుక్కలకు ఆపరేషన్లు చేయించామన్నారు. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ - ఆఫీస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇంతవరకు రీజనల్‌ పరిధిలో 3,485 ఫైళ్లను ఈ - ఆఫీస్‌ ద్వారా నిర్వహించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రవేశపెట్టిన ‘పురసేవ’ యాప్‌ద్వారా 5,200 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 4,500 పరిష్కరించామని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్వైపింగ్‌ మిషన్ల కోసం 3,700 దరఖాస్తులు రాగా 960 మిషన్లను సరఫరా చేశామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ ప్రకాష్, కమిషనర్‌ నయీద్‌అహమ్మద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు