కొండల కన్నీటి ధార!

20 Aug, 2017 02:19 IST|Sakshi
కొండల కన్నీటి ధార!

► అక్రమార్కుల దెబ్బకు పిండవుతున్న కొండలు
► యథేచ్ఛగా ప్రకృతి సంపద దోపిడీ
►  రాత్రి వేళల్లో సాగుతున్న గ్రావెల్‌ తవ్వకాలు
►  అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న అక్రమార్కులు  


నందిగామ :   పట్టణానికి దూరంగా, ప్రశాంతంగా కనిపించే ఆ ప్రాంతం.. రాత్రి వేళ మాత్రం రణగొణ ధ్వనులతో నిండిపోతోంది.. ఈ ప్రాంతానికి ప్రకృతి అందాలు అద్దిన పల్లగిరి కొండను అక్రమార్కులు తొలిచేస్తున్నారు. అధికారులు కూడా తమవంతు సాయమందిస్తూ అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిసున్నాయి. దీంతో అత్యంత విలువైన ప్రజా సంపద అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. పట్టణ శివారుల్లోని పల్లగిరి, రాఘవాపురం కొండలు అక్రమ మైనింగ్‌ వ్యాపారులకు వరంగా మారాయి. ఒక సర్వే నంబరులో తవ్వకాలకు అనుమతించామని మైనింగ్‌ అధికారులు చెబుతుండగా, వేరే ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుండటం గమనార్హం.  

చీకటి పడితే చాలు..   
అక్రమ మైనింగ్‌ వ్యాపారులు రాత్రి సమయాన్ని అనుకూలంగా మలచుకున్నారు. జన సంచారం పలుచబడినప్పటి నుంచి గ్రావెల్‌ మాఫియా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇళ్ల నిర్మాణాలు, స్థలాలు చదును చేసుకునేందుకు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు గ్రావెల్‌ వాడకం సర్వసాధారణం. దీంతో సదరు అక్రమార్కులు వ్యాపారం మూడు జేసీబీలు, ఆరు ట్రాక్టర్లుగా వర్థిల్లుతోంది. అడిగే నాధుడు లేడు.. అధికారుల నిఘా అంతకన్నా లేదు. అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించే వారే కనిపించరు. అధిక మొత్తంలో గ్రావెల్‌ అవసరమైన వారికి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న మొత్తం సరిపోకపోతే కొందరు వ్యాపారులు ఒకడుగు ముందుకు వేసి టిప్పర్ల ద్వారా సైతం గ్రావెల్‌ తరలిస్తున్నారు.  

తెలివిగా వ్యవహరిస్తున్న అధికారులు      
ప్రజా సంపదను పరిరక్షించాల్సిన అధికారులు అక్రమార్కులతో చేయి కలిపి గ్రావెల్‌ అక్రమ రవాణాకు పూర్తిగా సహకరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చే సందర్భాల్లో అక్రమ వ్యాపారులకు ఉప్పందించి, గ్రావెల్‌ రవాణాకు సహకరిస్తున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులు కొండలను కొల్లగొడుతూ ప్రకృతి సంపదను డబ్బు రూపంలోకి మార్చేసుకుంటున్నారు. కనీసం ఉన్నతాధికారులైనా కలుగజేసుకొని ప్రకృతి సంపదను పరిరక్షించాలని పలువురు మేధావులు కోరుతున్నారు.

ఒకే వేబిల్లుపై అనేక ట్రిప్పులు
పగటి వేళ సైతం అనధికారికంగా గ్రావెల్‌ తవ్వకాలు సాగిస్తున్నారు. ఒకే వే బిల్లుపై రోజు మొత్తంలో దాదాపు 20 నుంచి 30 ట్రిప్పుల వరకు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. నిజానికి ఒక వే బిల్లు ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే ముందుగానే మైనింగ్‌ శాఖాధికారుల నుంచి 50 వరకు వేబిల్లులు తీసుకుంటారు. ఇక వీటితోనే వందల ట్రిప్పులు గ్రావెల్‌ తరలించడం పరిపాటిగా మారింది.

కరుగుతున్న కొండలు 
నందిగామ పట్టణం నుంచి మధిర వెళ్లే రహదారిలో పట్టణ శివార్లలో రహదారికి ఇరువైపులా మున్నేటి తీరంలో ఉండే పల్లగిరి, రాఘవాపురం కొండలు ప్రకృతి అందాలకు నిలయంగా  దర్శనమిస్తుంటాయి. పల్లగిరి కొండను ఈ ప్రాంత ప్రజల సమైక్యత శిఖరం అని కూడా పిలుచుకుంటారు. పలు హిందూ దేవాలయాలు, చర్చిలతో పాటు ఓ దర్గా కూడా ఈ కొండపై ఉంది. కొండపైగల శిలువగిరి పుణ్య క్షేత్రాన్ని ఆనుకొని తవ్వకాలు జరుపుతుండటంతో క్రైస్తవ సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు నిత్యం పల్లగిరి కొండపై కొద్దిసేపు సేద తీరి ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తుంటారు. అక్రమ మైనింగ్‌ పుణ్యమాని ఈ కొండ ఇప్పటికే కొద్దిమేర రూపు కోల్పోయింది.

ఒకచోట అనుమతి.. మరోచోట తవ్వకాలు
గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై మైనింగ్‌ శాఖ డీఈ వై.సత్తిబాబును వివరణ కోరగా సర్వే నంబరు 21/6లో గ్రావెల్‌ తవ్వకాలకు ఓ వ్యాపారికి అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. అయితే, సదరు వ్యాపారి తనకు కేటాయించిన నంబరులో కాకుండా వేరే ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తుండటం గమనార్హం. ఈ విషయం తెలిసి కూడా అధికారులు కుంటి సాకులు చెబుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు