కోనసీమ రైలుకు పచ్చజెండా

3 Feb, 2017 23:00 IST|Sakshi
కోనసీమ రైలుకు పచ్చజెండా
 నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్‌ నిర్మాణానికి రూ.430 కోట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ఏళ్ల తరబడి ఊరిస్తున్న నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్‌ సాకారమయ్యే రోజులొచ్చాయి. ఈ రైల్వే లైన్‌ నిర్మాణానికి రూ.430 కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో పేర్కొనడంతో పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ లైన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టాలని నిర్ణయించి, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ) ఏర్పాటు చేశారు. గతంలో రాష్ట్రంలో మూడు ప్రాజెక్ట్‌ల భాగస్వామ్య పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించగా.. అందులో ఇది రెండవది. ఇది పూర్తయితే అన్నపూర్ణగా పేరుగాంచిన డెల్టా ప్రాంతం నుంచి ఉత్పత్తులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్‌ నరసాపురం నుంచి కోనసీమలోని అమలాపురం మీదుగా కోటిపల్లి వరకూ వెళ్తుంది. కోటిపల్లి నుంచి కాకినాడ వరకు ఇప్పటికే రైల్వే లైన్‌ ఉంది. ఈ రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం మీదుగా చెన్నై పోర్టులను కలుపడానికి అవకాశం ఏర్పడుతుంది.  ప్రస్తుతం విశాఖవిజయవాడ చెన్నై ప్రధాన రైల్వే చాలా రద్దీగా ఉంది. నరసాపురంకోటిపల్లి లైన్‌ నిర్మాణం పూర్తయితో సరకు రవాణాకు ఉపయోగపడుతుంది. కృష్ణా గోదావరి బేసిన్‌ నుంచి పెట్రోలియం, సహజవాయు ఉత్పత్తులు తరలించడానికీ పనికొస్తుంది. లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి 199798లో అమలాపురం మీదుగా నరసాపురంకోటిపల్లి రైల్వే లైన్‌ నిర్మాణానికి ఆమోదం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మొదట కాకినాడ నుంచి కోటిపల్లి వరకూ 45 కిలోమీటర్ల మార్గాన్ని రూ.74 కోట్లతో వేసి 200304లో ప్రారంభించారు. ప్రస్తుతం కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మిస్తారు. దీని కోసం భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయ్యిది. గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయలపై వంతెనల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఎట్టకేలకు నిధులు కేటాయించడంతో ఈ ప్రాంత ప్రజల కల సాకారం అయ్యే అవకాశం ఏర్పడింది.
 
బ్రాంచ్‌లైన్‌కు రూ.122 కోట్లు
విజయవాడభీమవరం నిడదవోలు వరకూ ప్రస్తుతం ఉన్న బ్రాంచ్‌ రైల్వేలైన్‌కు రూ.122 కోట్లు కేటాయించారు. 221 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ లైన్‌ డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ఈ నిధులను వినియోగిస్తారు.
 
 
మరిన్ని వార్తలు