బండ నేలల్లో పచ్చని పంటలు

27 Jul, 2016 18:36 IST|Sakshi

చెరువు మట్టిని తరలించుకున్న రైతులు
ఎర్రరేగడి నేలల్ని మాగాణిగా మార్చుకున్న వైనం
జహీరాబాద్‌ టౌన్‌:
జహీరాబాద్‌ నియోకవర్గంలో ఎర్ర, నల్లరేగడి భూములున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎర్రబండతో కూడిన పొలాలు ఉన్నాయి. ఎర్రబండ భూములు సాగుకు ఏమాత్రం అనుకూలం కావు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం బండ భూములు కలిగిన రైతులకు వరంగా మారింది. ఈ పథకం కింద పూడిక తీయగా వచ్చిన మట్టిని పంటలు పండని రాతి నేలల్లోకి తరలించుకుని నల్లరేగడి భూములుగా మార్చుకున్నారు

ఈ ప్రాంత రైతులు. బండనేలలను సాగుకు యోగ్యంగా చేసుకుని పంటలు పండిస్తున్నారు. వర్షాలు కూడా పడడంతో సాగుచేసిన పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల మట్టిని పొలాలకు తరలించుకునేందుకు అనుమతులివ్వడంతో ఆసక్తి కలిగిన రైతులు ముందుకు వచ్చి సారవంతమైన చెరువు మట్టిని తమ బండ రాతి భూముల్లోకి తరలించి నల్ల రేగడి భూములుగా మార్చుకుంటున్నారు. మట్టితో నింపిన పొలాల్లో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. రైతులు తమ ఆర్థిక స్తోమతను బట్టి మట్టిని తరలించారు.

మిషన్‌ కాకతీయ పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కో టిప్పరుకు రూ.300- రూ.500 వరకు ఖర్చుచేసి నల్లరేగడి మట్టిని తరలించారు. ఎకరానికి వంద నుంచి 150 ట్రిప్పుల మట్టిని నింపారు. ఎత్తుపల్లాలు ఉన్న చోట చదును చేశారు. ఎకరాకు రూ. 50 వేల వరకు ఖర్చుచేసి బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు. ఊహించని విధంగా బండ భూములు సారవంతమైన నల్ల రేగడి పొలాలుగా మారండంతో రైతులు ఉత్సాహంతో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. కొందరు చెరకు పంట వేయగా మరి కొందరు అల్లం పంటను సాగు చేస్తున్నారు. మరి కొందరు రైతులు ఖరీఫ్‌ పంటలైన సోయాబీన్, పెసర, కంది తదితర పంటలు వేశారు. మట్టి తరలించిన పొలాల్లో పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని రైతులు అంటున్నారు.  
 

>
మరిన్ని వార్తలు