‘పచ్చ’శాల

10 Aug, 2016 20:18 IST|Sakshi
కుసంగి ప్రాథమిక పాఠశాల
  • ఆహ్లాదకరంగా కుసంగి పాఠశాల
  • ఆవరణంలో విరివిగా మొక్కలు
  • సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ.. నిత్యం  పర్యవేక్షణ
  • అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
  • టేక్మాల్: రకరకాల చెట్లు, చల్లని వాతావరణం మధ్య ఎంతో ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంది ఆ పాఠశాల..  ఆవరణలో విరివిగా మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ చెట్ల కిందే సేదతీరుతున్నారు. మొక్కల సంరక్షణలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు.

    టేక్మాల్‌ మండలం కుసంగి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఎటుచూసినా చెట్లే..  పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గయ్య, ఉపాధ్యాయుడు తౌర్యానాయక్‌ల ప్రోత్సాహంతో ఆవరణలో మొక్కలు విరివిగా నాటారు. నాటిన ప్రతి మొక్కను కపాడాలన్నదే వీరి లక్ష్యం. ఇక్కడ టేకు, మామిడి, జామ, కొబ్బరి, చమాన్, రకరకాల పూల మొక్కలను నాటారు. పాఠశాలకు వచ్చే దారిలో ఇరువైపులా చమాన్‌ పెంచడంతో స్వాగత తోరణంగా మారింది. మరి కాస్త లోపలికి వస్తే పాఠశాల చుట్టూ చమాన్‌తో పాటూ, పూల మొక్కలను పెంచుతున్నారు. వెనుక భాగంగాలో పూర్తిగా టేకు మొక్కలను పెంచుతున్నారు. పాఠశాల ముందున్న జెండా గద్దె చుట్టూ పూల చమాన్‌ను పెంచడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

    మొక్కల దత్తత
    ప్రతి మొక్కను క్లాస్‌ల వారీగా విద్యార్థులకు దత్తత ఇచ్చారు. నిత్యం ఆ విద్యార్థి నీటి మళ్లించడం, చెత్తను ఎరివేస్తూ గడ్డిని తొలగించడం ఆ మొక్క ఆలన, పాలన చూసుకుంటారు. వారు వినియోగించే నీరు వృధా పోకుండా చెట్లకు కాలువలు చేసి అందిస్తున్నారు. చమాన్‌ మొక్కలు పెద్దవిగా కాగానే  ఆకృతిలో కత్తిరిస్తూ కొత్త అందాన్ని రూపొందిస్తున్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు సైతం ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో సమయాన్ని వెచ్చిస్తూ మొక్కలను కాపాడుతున్నారు.

    ఉన్నత పాఠశాలలోనూ..
    పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలో  సైతం భారీగా మొక్కలు పెరిగాయి. పూలమొక్కలు, చమాన్‌ను పెంచుతున్నారు. చెట్లకింద,  చల్లని గాలి మధ్య విద్యార్థులకు చదువులను అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు