అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు

4 Jan, 2016 02:07 IST|Sakshi
అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు

♦ సీఆర్‌డీఏకు సర్వే బాధ్యతలు
♦ 5వేల ఎకరాల భూ సేకరణ లక్ష్యం

 సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్ అందించిన మాస్టర్ ప్లాన్‌లోనూ రాజధానిలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. ఎయిర్‌పోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తుళ్లూరు, మంగళగిరి, అమరావతిలలో ఎక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించాలనే అంశంపైనే తర్జనభర్జనలు పడుతోంది. ఈ సర్వే బాధ్యతల్ని ప్రభుత్వం సీఆర్‌డీఏకు అప్పగించింది. ఆ సర్వే ప్రస్తుతం కొనసాగుతోంది. మంగళగిరి ప్రాంతంలో కొండలు ఉండటంతో ఎయిర్ సిగ్నల్స్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పక్కనే జాతీయ రహదారి ఉండటంతో ల్యాండ్ ఇన్‌స్ట్రుమెంట్ సిస్టం (ఎల్‌ఈఎస్)కు అంతరాయాలు ఏర్పడి రాత్రి వేళల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశాలు తక్కువ,దీంతో  తుళ్లూరు, అమరావతి ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 లక్ష్యం ఐదు వేల ఎకరాలు.. : అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు నిర్మించాలంటే కనీసం ఐదు వేల ఎకరాల భూములు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి చుట్టూ 180 కిలోమీటర్ల మేర ఔటర్ రింగు రోడ్డు ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు పక్కనే శంషాబాద్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేశారు. ఏపీ రాజధానిలో కూడా ఔటర్ రింగురోడ్డు పక్కన భూములు ఉన్నచోట అక్కడ ఏర్పాటు చేయాలని సర్కారు ఆలోచన చేస్తోంది. భూముల లభ్యత ఎక్కడ? అన్నింటికి అనువైన ప్రాంతం ఏది? అనే అంశాలతో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలని సీఆర్‌డీఏకు ఆదేశాలు జారీ చేశారు.

 గన్నవరం విస్తరణ వెనక్కి...
 రాజధాని ప్రాంతానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గన్నవరం ఎయిర్‌పోర్టును విస్తరించేందుకు భూ సేకరణ నోటిఫికేషన్‌ను గతేడాది జారీ చేశారు. అయితే విస్తరించేందుకు అవకాశాలు లేవు. ఇక్కడకు సమీపంలోని భూములు టీడీపీకి చెందిన నేతలవి ఉండడమే కారణం. రాజధాని ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసి గన్నవరంలో ఎయిర్‌పోర్టును వ్యాపారం కోసం అంటే కార్గో ఎయిర్‌పోర్టుగా వినియోగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు