చుక్క రాలదు.. దాహం తీరదు!

30 Jul, 2017 21:31 IST|Sakshi
చుక్క రాలదు.. దాహం తీరదు!

– 29 మండలాల్లో అడుగంటిన భూగర్భ జలాలు
– 50 మండలాల్లో క్లిష్ట పరిస్థితులు
– 82 మీటర్లు లోతుకెళ్లిన భూగర్భంలో కనిపించని నీటి చెమ్మ
– 5 వేలు ఎండిన చేతి పంపులు


‘అనంత’ ఒట్టిపోతోంది. నీటి బొట్టు నేలకు రాలకపోవడంతో దాహం తీరే మార్గమూ కనిపించడం లేదు. 63 మండలాల్లో 13 మినహా 50 మండలాల్లో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఇవేవో గాలి లెక్కలు కాదు!  గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారిక రికార్డులు వెల్లడి చేస్తున్న పచ్చి నిజాలు!! జిల్లాలోని అగళి మండలంలో 82  మీటర్లు లోతుకు వెళ్లినా నీటి చెమ్మ కనిపించడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

అనంతపురం సిటీ: గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. తాగునీరు సైతం లభ్యం కాక ప్రజలు విలవిల్లాడుతుంటే.. ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడం లేదు. గుక్కెడు నీటి కోసం జిల్లాలోని 50 మండలాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లెలా అరుస్తుంటే పట్టించుకోవడం లేదు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉన్న నీరు లభ్యమవుతోంది. గత్యంతరం లేని స్థితిలో ఈ నీటినే ప్రజలు తాగాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి పదిలో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. తాగునీటి సురక్షితంగా లేకపోవడమే ఇందుకు కారణంగా వారు స్పష్టం చేస్తున్నారు.

50 మండలాల్లో పరిస్థితి దయనీయం
జిల్లాలో అరకొర వర్షాలు కురిసినా అవి భూగర్భ జలాల పెంపునకు దోహదపడలేదు.  దీంతో మండలాల వారిగా సమస్య ఏ స్థాయిలో ఉందో అధికారులు పరిశీలించి రూపొందించిన నివేదికలో అంశాలు ఇలా ఉన్నాయి.

= జిల్లాలోని 21 మండలాల్లో క్లిష్ట, అతి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి.
= ఎక్కువ నీటి వినియోగం కారణంగా 29 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.
= 50 మండలాల్లో నీటి కష్టాలు ఉన్నాయి.
= జిల్లాలోని మొత్తం 12,676 చేతి పంపులకు గాను ఐదు వేల పంపులు పూర్తిగా ఎండిపోయాయి. మరో ఐదు మండలాల్లోనూ దరిదాపుగా ఈ పరిస్థితులు ఉన్నాయి.

కలుషిత నీటి సరఫరా
ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న నీటిలో కూడా కాలుష్యం ఉన్నట్లు ప్రజలు వాపోతున్నారు. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ బోరు బావుల నుంచి సేకరించిన నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆ నీటిని పరిశీలించకుండా సరఫరా చేయడం వల్ల తాగిన ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారులు పెద్దగా స్పందించడం లేదు.  

నీటి కాలుష్యంపై జరపని పరీక్షలు
తాగునీటి కాలుష్యంపై ప్రజలను చైతన్య పరచడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా చాలా మంది ఫ్లోరైడ్‌ బారిన పడి దీర్ఘకాలిక జబ్బులకు లోనవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి కాలుష్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏ నీటిని తాగితే ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందో నిర్ధారించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు