బయోమెట్రిక్‌తోనే విత్తన పంపిణీ

30 Mar, 2017 23:39 IST|Sakshi
బయోమెట్రిక్‌తోనే విత్తన పంపిణీ

– మే రెండో వారంలో వేరుశనగ పంపిణీకి శ్రీకారం
అనంతపురం అగ్రికల్చర్‌ : గత ఏడాది మాదిరిగా ఈ సారీ ఆధార్‌బేస్డ్‌ బయోమెట్రిక్‌ విధానంతోనే విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ సారి చౌక దుకాణాలను ఉపయోగించుకుని గ్రామ గ్రామాన పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అయితే.. ఇప్పటికిప్పుడు అలా చేయడం కష్టమని ప్రాథమికంగా తేల్చేశారు.  అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఒకట్రెండు గ్రామాల్లో మాత్రమే పైలట్‌ ప్రాజెక్ట కింద చౌక డిపోల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

4.50 లక్షల క్వింటాళ్లు కేటాయింపు
     ఈ ఖరీఫ్‌లో రాయితీపై 4.50 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ పంపిణీ చేయాలని వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి అనుమతులొచ్చాయి. ఇందులో ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్‌ ద్వారా 3.50 లక్షల క్వింటాళ్లు సేకరించడంతో పాటు ప్రస్తుత రబీలో పండిన పంట ఉత్పత్తులు కనీసం లక్ష క్వింటాళ్లను ఎన్‌జీవోల ద్వారా సేకరించి మనవిత్తన కేంద్రాల (ఎంవీకే) ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి పూర్తి ధరలు, రాయితీలు ఖరారయ్యే అవకాశముంది. అంతలోపే అన్ని మండలాల్లో విత్తనకాయలు సిద్ధం చేసి ఉంచాలని సేకరణ సంస్థలను ఆదేశించారు. ఇప్పటికే ఆ సంస్థలు విత్తనకాయల ప్రాసెసింగ్‌ మొదలుపెట్టాయి. మే రెండో వారం నుంచి పంపిణీకి  ప్రణాళికలు రచించారు. వర్షాలొస్తే జూన్‌లోనే ముందస్తుగా పంట వేసే పరిస్థితి ఉంది. దీంతో జూన్‌ మొదటి వారానికల్లా పంపిణీ  ముగించేయాలని ఆలోచిస్తున్నారు.

గత ఏడాది మాదిరిగానే..
     రాష్ట్రంలోనే తొలిసారిగా గత ఏడాది జిల్లాలో ఆధార్‌బేస్డ్‌ బయోమెట్రిక్‌ పద్ధతిలో విత్తన పంపిణీ చేపట్టారు. మొదట్లో కొన్ని సాంకేతిక సమస్యలు  ఎదురైనా ఎలాగోలా 3.10 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు. గతంలో ఎదురైన సమస్యలను అధిగమించి ఈ సారి పకడ్బందీగా మండల కేంద్రాల్లో పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అదే చౌకడిపోల ద్వారా అయితే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామాల్లో గోదాములు, కనీస సదుపాయాలు, బందోబస్తు, తగినంత సిబ్బంది, సర్వర్‌ కనెక్టివిటీ లాంటి సమస్యలతో పాటు విత్తన కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లోనే ఇస్తామంటే  రైతులందరూ ఒకేసారి వస్తారని, వారికి  విత్తనకాయలు సమకూర్చడం కష్టమని అంటున్నారు. 

మరిన్ని వార్తలు