గతం..పునరావృతం!

11 Mar, 2017 23:40 IST|Sakshi
గతం..పునరావృతం!

- ధర్మవరంలో అశాంతి
– పరిటాల, వరదాపురం మధ్య తారస్థాయికి ఆధిపత్యపోరు
– ఇరువర్గాల విభేదాలతో ధర్మవరం వాసుల్లో ఆందోళన
– ప్రశాంతతకు భంగం వాటిల్లే ప్రమాదం
– సునీత, సూరిని చంద్రబాబు హెచ్చరించినా ఖాతరు చేయని వైనం
– తాజా ఘటనతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం
– పోలీసులు కౌన్సెలింగ్‌ ఇవ్వకపోతే పరిస్థితి చేజారే ప్రమాదం
– ఘటనపై ముఖ్యమంత్రి ఆరా.. ఇరు వర్గాలకు హెచ్చరిక


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
    ధర్మవరం... పాతికేళ్ల కిందట రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైన పేరు. రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలతో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించారు. 2003 వరకూ ఇదే పరిస్థితి.  అయితే.. ఆ తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది.  2004–2014 వరకూ పదేళ్లపాటు ప్రజలు ప్రశాంతంగా జీవించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ధర్మవరంలో మళ్లీ మరో రెండు వర్గాల మధ్య పోరు మొదలైంది. మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య కొంతకాలం కిందట మొదలైన ఆధిపత్య పోరు శుక్రవారం నాటి ఘటనతో మరింత తీవ్రమైంది. ధర్మవరం ప్రజలను మళ్లీ అశాంతిలోకి నెట్టేశారు.

  దూరం పెంచిన 2009 ఎన్నికలు
    2009 ఎన్నికల టికెట్‌ వ్యవహారం సునీత, సూరి మధ్య చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. 2004–09 మధ్యకాలంలో పరిటాల వర్గానికి చెందిన గోనుగుంట్ల జయమ్మ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2009లో ఎమ్మెల్యే టికెట్‌కు వరదాపురం సూరి పోటీపడ్డారు. కానీ జయమ్మ కుమారుడు విజయ్‌కుమార్‌కు ఇవ్వాలని సునీత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సూరికి, విజయ్‌కు ఇద్దరికీ కాకుండా పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించారు. ఈ ఎన్నికల్లో వరదాపురం సూరి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల కరపత్రాల్లో పరిటాల రవి ఫొటో కూడా ముద్రించుకోలేదు. ఇది ఇరువర్గాల మధ్య విభేదాలకు బీజం పడింది. తర్వాత దూరం పెరుగుతూ వచ్చింది. గత ఏడాది పరిటాల రవి వర్ధంతి ముందురోజు సూరి.. పరిటాల స్వగ్రామమైన వెంకటాపురానికి వెళ్లగా కొందరు పరిటాల వర్గీయులు అవమానించారని, దీంతో  ఆయన వెంటనే వెనుదిరిగి వచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో సునీత వర్గానికీ అవమానం చేయాలని సూరి భావించారు. ధర్మవరంలో చంద్రబాబు పర్యటన సమయంలో పట్టణం మొత్తాన్ని ఫ్లెక్సీలతో నింపి, ఏ ఒక్కదానిలోనూ సునీత ఫొటో లేకుండా చేశారు. ఇది సునీతకు తీరని అవమానాన్ని మిగిల్చింది. మరోఫ్లెక్సీ ఘటనలోనూ ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ధర్మవరంలో పరిటాల పెత్తనం లేకుండా టీడీపీ కార్యకర్తలంతా తన చేతుల్లోనే ఉండేలా సూరి రాజకీయం చేస్తున్నారు. ఈయన వ్యవహారంతో ధర్మవరంలో తాము పట్టుకోల్పోతున్నామని, ఎలాగైనా  దెబ్బతీయాలనే ఆలోచన  పరిటాల వర్గంలో పడింది. ఈ విభేదాలు సాగునీరు, టెండర్లు ఇలా పలు సందర్భాల్లో పొడచూపాయి. వీరి ఆధిపత్య పోరు ప్రజల అభివృద్ధి కోసం కాదనేది ధర్మవరంతో పాటు రాప్తాడు ప్రజలూ గ్రహించారు. తమ ప్రాంత అభివృద్ధి విషయంలో విభేదాలు పెట్టుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఇద్దరూ  స్వప్రయోజనాల కోసం పోరు నడిపిస్తున్నారు. దీన్ని గ్రహించిన ప్రజలు రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు.

చంద్రబాబు హెచ్చరించినా...
ఇటీవల చంద్రబాబు ఇద్దరినీ అమరావతికి పిలిపించి మందలించారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. అయినప్పటికీ కయ్యానికి దిగుతున్నారు. పవన విద్యుత్‌కు సంబంధించి రామగిరి నుంచి అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ను ధర్మవరానికి లాగుతున్నారు. ఇందులో భాగంగా రూ.2.5కోట్ల పనులు ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఈ  పనుల్లో సూరి గుడ్‌విల్‌ అడిగారని, ఇవ్వనందుకే అడ్డుకున్నారనేది పరిటాల వర్గం వాదన. కేబుల్‌ పాతే దారిలోనే తాము రోడ్డు పని చేస్తున్నామని, ఈ నెల 15లోపు అది పూర్తవుతుందని, ఆ తర్వాత కేబుల్‌ పనులు చేసుకోవాలని సూచించినా వినలేదనేది సూరి వర్గం వాదన.

ఈ క్రమంలోనే శుక్రవారం ధర్మవరంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ధర్మవరంలోని సూరి వర్గీయులు, రామగిరి, చెన్నేకొత్తపల్లి నుంచి ధర్మవరానికి వచ్చిన 200మంది పరిటాల వర్గీయులు రాళ్ల వర్షం కురిపించుకున్నారు. దీనిపై ఇరువర్గాలు శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. రాత్రి మొత్తం ధర్మవరంలో పోలీసు గస్తీ నిర్వహించారు. శనివారం సూరి జిల్లా కేంద్రంలోని ఎస్పీ బంగ్లా వద్ద ధర్నా చేపట్టారు. పరిటాల అనుచరులు, పోలీసులు తమ వర్గీయులను దారుణంగా కొట్టారని, వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

సీఎం హెచ్చరిక
            తాజా ఘటన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు సూరి, సునీతకు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. తాను స్వయంగా హెచ్చరించి పంపిన నెలలోపే తిరిగి గొడవ పడటంపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. అనంతపురంలో పార్టీ పరువును బజారుకు ఈడ్చారని, ఇప్పటికే పార్టీకి 92శాతం నష్టం జరిగిందని, విభేదాలు ఇలాగే ఉంటే వందశాతం నష్టం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని మండిపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు ఇరువురూ ఎవరి వాదన వారు వినిపించినట్లు సమాచారం.

క్షణ క్షణం...భయం భయం
            పరిటాల, సూరి మధ్య తలెత్తిన విభేదాలతో ధర్మవరం వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2004కు ముందు పరిస్థితి భయంకరంగా ఉండేదని, ఇప్పుడు ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్లీ పాత రోజులు వస్తున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు.  పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇవ్వకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదముందని ప్రజలు భయపడుతున్నారు.

మరిన్ని వార్తలు