ఉచితంపై పేచీ!

23 Aug, 2016 23:17 IST|Sakshi
ఉచితంపై పేచీ!

కడప అగ్రికల్చర్‌:
వ్యవసాయ విద్యుత్‌ సర్వీసుల నుంచి సేవా చార్జీల బకాయి పేరుకుపోయిందని, దాన్ని చెల్లించకుంటే ఉచిత కరెంటు కట్‌ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఉచిత విద్యుత్‌ సర్వీసులను రైతులు తీసుకుని సేవా చార్జీలు చెల్లించలేదని బూచి చూపి శాశ్వితంగా ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయ ఉచిత విద్యుత్‌ సేవా చార్జీలను బలవంతంగానైనా వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించింది. ఈ నెలాఖరులోగా బకాయిలన్నీ కట్టితీరాలని రైతులపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం ప్రకటించింది. బకాయి చెల్లించకుంటే సెప్టెంబరు మొదటి వారంలోగా ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ రద్దు చేస్తామని రైతులను హెచ్చరించాలని పేర్కొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడలో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించి తక్షణమే వసూలుకు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బందికి రైతుల నుంచి బకాయిలు వసూలు చేయాలని టార్గెట్లు వి«ధించినట్లు జిల్లా విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా బకాయి చెల్లించని రైతుల వ్యవసాయ కనెక్షన్లను తాత్కాలికంగాను, ఏడాదిలోగా బకాయి చెల్లించని ౖరైతుల కనెక్షన్లను శాశ్వితంగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని దక్షిణ మండలం విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
ఉచిత విద్యుత్‌ మంగళానికి రంగం సిద్ధం:
జిల్లాలో వ్యవసాయానికి ఉచిత çసర్వీసులకు సంబంధించి కడప డివిజన్‌లో 9580 సర్వీసులు, పులివెందుల డివిజన్‌లో 21416 సర్వీసులు, ప్రొద్దుటూరు డివిజన్‌లో 19416 సర్వీసులు, మైదుకూరు డివిజన్‌లో 35890 సర్వీసులు, రాజంపేట డివిజన్‌లో 35192 సర్వీసులు, రాయచోటి డివిజన్‌ 24653 సర్వీసులున్నాయి. 2004లో ఈ సర్వీసులన్నింటీకి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ప«థకాన్ని అందించారు. ఉచిత విద్యుత్‌ వాడుకునే రైతుల నుంచి సర్వీసు చార్జీల కింద ఒక్కో సర్వీసుకు రైతు నెలకు రూ.30లు వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటì  వరకు రైతులు ఆ సేవా చార్జీలలో (సర్వీసు చార్జీ) ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మొత్తం 1,46,147 ఉచిత విద్యుత్‌ సర్వీసులకు సర్వీసు చార్జీల కింద ఇప్పటి వరకు రూ.7.92 కోట్లు బకాయి ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ బకాయి పేరుకు పోవడంతోను, ఇప్పుడు ఈ సర్వీసులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందని, దీన్ని భరించడం సాధ్యం కాదని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేసింది.
ఆందోళనలో అన్నదాతలు
రైతులకు ఎంత మేలు చేసినా తక్కువేనని తమ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను మరింత సరళతరం చేస్తామని ఎన్నికల సభల్లో చెప్పిన  చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉచిత విద్యుత్‌ను సేవా చార్జీల బకాయి పేరుతో ఎలాగైన రద్దు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  ఉచిత విద్యుత్‌ ఇవ్వడం సీఎం చంద్రబాబునాయుడుకు పూర్తి ఇష్టం లేదని రైతులు, రైతు సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. రెండు సంవత్సరాలుగా కరువుతో అల్లాడుతుంటే రైతులపై కనికరం లేకుండా ఉచిత విద్యుత్‌ సేవా చార్జీల బకాయిలు మోపి పిండుకోవాలని చూడడం ప్రభుత్వానికి తగదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు