సలహా సంఘాలేవి?

8 Jul, 2017 03:03 IST|Sakshi

►మూడేళ్లుగా ఆహార సలహా సంఘం కమిటీలు వేయని ప్రభుత్వం
► పెరుగుతున్న కల్తీ మోసాలు  
► నష్టపోతున్న వినియోగదారులు


జిల్లాలో ఆహార సలహా సంఘం కమిటీలు లేకపోవడంతో కల్తీ మోసాలు ఎక్కువయ్యాయి. వినియోగదారుల్లో చైతన్యంతోపాటు కల్తీలను అరికట్టేందుకు గత ప్రభుత్వం ఆహార సలహా సంఘం కమిటీలను వేసింది. ఇవి మూడు నెలలకోసారి సమావేశమై వినియోగదారుడి రక్షణకు పలు నిర్ణయాలు తీసుకునేవి. కానీ గత మూడేళ్లుగా ఈ కమిటీలు లేకపోవడంతో మోసాలు పెరిగిపోయాయి.  

కెరమెరి(ఆసిఫాబాద్‌): వినియోగదారుడు ఏదో విధంగా మోసపోతూనే ఉన్నాడు. కొనే పదార్థాల్లో కల్తీ, నిత్యావసర సరుకుల తూనికల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తెలియకుండానే వినియోగదారుడు నష్టపోతున్నాడు. అయితే వినియోదారుడి రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ క్ర మంలో వినియోగదారుల్లో చైతన్యంతోపాటు పలు సూచనలు సలహాలు   తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాల్సిన ఆహార సలహా సంఘం కమిటీలు జిల్లాలో ఎక్కడా కాన రావడం లేదు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతీ మూడు మాసాలకోసారి సమావేశం నిర్వహించి అందులో వినియోగదారుడి రక్షణకు పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

మూడేళ్లుగా ఈ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి.కుమురం భీం జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. రెండు డివిజన్లు, వాటిలో 173 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఏ స్థాయిలోనూ ఆహార సలహా సంఘం కమిటీలు లేకపోవడంతో వినియోగదారుడు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నాడు. నాణ్యమైన ఆహారం అందక ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల కల్తీ రాయుళ్లు రెచ్చిపోయి దేన్నీ విడిచిపెట్టకుండా కల్తీ చేస్తుండడంతో ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది.

అయితే ఈ కల్తీలపై ప్రజలను చైతన్య వంతుల్సి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తగు నిర్ణయం, సూచనలు, సలహాలు తీసుకునేందుకు గతంలో ప్రభుత్వం ఆహార సలహా సంఘాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కల్తీ మోసాలపై ప్రతీ మూడు మాసాలకోసారి తగిన నిర్ణయాలు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ఆహార సలహా సంఘాలు పత్తా లేకుండా పోవడం గమనార్హం!

చౌకధరల దుకాణాలపై కొరవడిన నిఘా
ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో జరుగుతున్న మోసాలపై ఈ కమిటీలు గతంలో ఆరా తీసేవి. లోపాలుంటే కమిటీ సమావేశం దృష్టికి తెచ్చిం ది. దీంతో అధికారులు చర్యలు తీసుకునే వారు. ఇప్పుడు సలహా సంఘాలు లేకపోవడంతో చౌకధరల దుకాణాల్లో ఇష్టారాజ్యం నడుస్తోంది.

ఆహార పదార్థాలు కల్తీ
ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులు సైతం కల్తీ అవుతున్నాయి. కాగజ్‌నగర్‌తోపాటు తదితర ప్రాంతాల్లో గతంలో కల్తీ నూనెతోపాటు ఇతర ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉండడంతో అధికారులు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. కొన్ని శాంపిళ్లను ల్యాబ్‌కు కూడా పంపించారు. ఇలాంటి కల్తీ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం వినియోగదారుల రక్షణకు అనేక చట్టాలు తెచ్చినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. వీటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత సలహా సంఘాలకు ఉండేది. సంఘాలే నామమాత్రంగా మారడంతో చట్టాల అమలును ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇందులో ఆహార కల్తీ నిరోధక చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం, డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్స్‌ చట్టం, నీటి కాలుష్య నివారణ చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల చట్టం వంటి అనేకంగానే ఉన్నాయి. వీటిపై అవగాహన కల్పిస్తే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది.

జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు..
జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ఆహార సలహా సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, వినియోగదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వర్గాల నుంచి సభ్యులు ఉంటారు. ఈ కమిటీ ప్రతీ మూడు మాసాలకు ఒకసారి సమావేశమై వినియోగదారుల సమస్యలపై చర్చించేది. సమవేశంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించేంది. ప్రభుత్వ అధికారులు సమస్యలను పరిష్కరించే వారు.  తిరిగి మూడు మాసాలకోసారి జరిగే సమీక్షలు ప్రగతిని వివరించాల్సి ఉంటుంది. దీని వల్ల వినియోగదారుడి సమస్య కొంతైన పరిష్కారమవుతుందనే నమ్మకం ప్రజల్లో  ఉంది.

మరిన్ని వార్తలు