ఎరువు బరువు

6 Jun, 2017 22:22 IST|Sakshi
ఎరువు బరువు

కరువు జిల్లాపై పిడుగుపాటు
అన్నదాతపై జీఎస్టీ భారం
12శాతం పన్ను  శ్లాబులో ఎరువులను చేర్చడంపై ఆందోళన


జీఎస్టీ (వస్తు సేవలపన్ను) రైతుకు గుదిబండగా మారనుంది. అన్ని రకాల ఎరువులను 12శాతం పన్నుల శ్లాబులోకి చేర్చడంతో
అన్నదాతపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఎరువులపై అన్ని రాష్ట్రాల్లోనూ 4 నుంచి 8 శాతం పన్ను పరిధిలో ఉంది. ఇప్పుడు దీన్ని
ఏకంగా 12 «శాతానికి పెంచడంతో ఎరువుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రైతుల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న నేటి
పరిస్థితుల్లో ఎరువులపై పన్నులు పెంచడం మూలిగేనక్కపై తాటికాయ పడ్డచందంగా ఉందని రైతు సంఘ నాయకులు అంటున్నారు.


చిత్తూరు, సాక్షి: దేశమంతటా ఒకే పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ విధానం కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి అమల్లోకి తెస్తోంది. ఈ విధానం కొన్ని వర్గాలకు మేలు చేస్తుంటే దేశానికి వెన్నెముకవంటి అన్నదాతపై మోయలేని భారం అవుతోంది. ఇప్పుడున్న ధరల విధానంతోనే ఎరువులు కొనా లంటే అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో కర్షకులు ఉంటే..  ఎరువులపై మరింత పన్ను వేస్తూ వారి నడ్డివిరుస్తోంది. 12«శాతం పన్ను శ్లాబు లోకి ఎరువులను తేవడంతో టన్ను యూరి యాపై రూ.400, 50 కేజీల డీఏపీపై రూ.125, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులపై టన్నుకు రూ.350 వరకు రైతులపై భారం పడనుంది. ఎరువుల ధరలపై విపరీతంగా ఖర్చుపెరుగుతున్నా..దిగుబడికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు.

ఒక్క ఖరీఫ్‌లోనే..
జిల్లాలో ఖరీఫ్‌లో యూరియా 40,539, డీఏపీ 12050, పొటాషియం 8500, కాంప్లెక్స్‌ ఎరువులు 31,900, పాస్పేట్‌ 2300 టన్నుల వినియోగం ఉంటుంది. యూరియాపై రూ.16.10 కోట్లు, డీఏపీపై రూ.3.01 కోట్లు, పొటాషియంపై రూ.34 లక్షలు, కాంప్లెక్స్‌ ఎరువులపై రూ.12 కోట్లు, పాస్పేట్‌పై రూ.5.75 లక్షలు భారం పడనుంది. ఒక్క ఖరీఫ్‌లోనే రూ.32 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటి వరకు సేంద్రియ ఎరువులు, బయోఫర్టిలైజర్స్‌పై ఎలాంటి పన్నులు లేవు. వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవడంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడుతున్న జిల్లా రైతాంగానికి ఇది ఏమాత్రం రుచించడం లేదు. ఓ వైపు సేంద్రియ వ్యవసాయం చేయాలని రైతులపై ఒకింత ఒత్తిడి తెస్తూనే పన్నులు వేయడం.. నోటితో చెప్పి నుదిటితో వెక్కిరించినట్లు ఉందని వారు అంటున్నారు.

స్పష్టత లేదు..
ఎరువులపై పెరిగిన పన్నును భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. ఒక్క యూరియా బస్తాపైనే సుమారు రూ.20 వరకు పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్‌కే సుమారు జిల్లాలో రూ.16కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా అన్నది అనుమానించాల్సిన విషయం. ఇతర సూక్ష్మపోషకాల కంటే ఎక్కువ సబ్సిడీ యూరియాపైనే ఉండడంతో రైతులందరూ యూరియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు యూరియాపై కూడా జీఎస్టీ బండ పడడంతో వినియోగం తగ్గుతుందని రైతు సంఘ నాయకులు అంటున్నారు. 

మరిన్ని వార్తలు