తొలి అడుగు.. తడబాటు..

2 Jul, 2017 23:13 IST|Sakshi
తొలి అడుగు.. తడబాటు..
- జీఎస్‌టీపై కానరాని స్పష్టత
- సర్వత్రా గందరగోళం
- ముందుకు సాగని వ్యాపారాలు
- పాత తేదీలపై అమ్మకాలు
అమలాపురం : వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు లేవు.. నగల షాపుల్లో బోణీలు లేవు.. ఎలక్ట్రానిక్‌ షాపులు వెలవెలబోతున్నాయి. హోల్‌సేల్‌ షాపుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు నిలిచిపోయాయి. సెల్‌ఫోన్‌ షాపులు.. సిమెంట్‌.. ఐరన్‌.. చివరకు ఒక మోస్తరు హోటళ్ల వద్ద సహితం కొనుగోళ్లు లేవు. బయటి నుంచి లోడుతో వచ్చే లారీలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ప్రారంభం కావడంతో.. జిల్లాలోని వాణిజ్య కేంద్రాల వద్ద అనధికార బంద్‌ వాతావరణం నెలకొంది. కొత్త పన్ను విధానంపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా గందరగోళం కనిపిస్తోంది. వ్యాపారం చేయాలంటే ఒకరకమైన భయం. జీఎస్‌టీవలన లాభమే తప్ప నష్టం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నా.. భయపడాల్సిన పని లేదని వాణిజ్య పన్నుల శాఖాధికారులు చెబుతున్నా.. వ్యాపారులు ధైర్యం చేసి ముందడుగు వేయలేకపోతున్నారు. తొలి అడుగులోనే తడబడుతున్నారు. పెద్దనోట్ల రద్దు తరువాత వ్యాపారులు ఎదుర్కొంటున్న పెద్ద ఆర్థిక సంక్షోభంగా జీఎస్‌టీ అమలు మారింది.
వెలవెలబోతున్నాయిలా..
- జీఎస్‌టీ అమలులోకి వచ్చిన తరువాత రెండో రోజు కూడా మార్కెట్లను చూస్తుంటే అనధికార బంద్‌ వాతావరణం కనిపిస్తోంది. గడచిన రెండు రోజులుగా రోజువారీ జరిగే వ్యాపారం 30 శాతం కూడా జరగకపోవడం గమనార్హం.
- రాజమహేంద్రవరం, కాకినాడతోపాటు పలు మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామాల్లో ఆదివారం వ్యాపార సముదాయాలకు సెలవు. కానీ అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి మున్సిపాలిటీలు, వస్త్ర వ్యాపార కేంద్రమైన ద్వారపూడి వంటి కీలక వాణిజ్య కేంద్రాల్లో సెలవు లేదు. కానీ, ఇక్కడ కూడా ఆదివారం పెద్దగా వ్యాపారం సాగలేదు.
- జీఎస్‌టీ అమలులోకి వచ్చిన తరువాత పన్ను శాతం తగ్గి.. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రచారం జరిగింది. కానీ వాటి అమ్మకాలు సహితం భారీగా పడిపోయాయి.
- ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన మార్కెట్‌ కేంద్రమైన రాజమహేంద్రవరంలో నిత్యావసర వస్తువుల దిగుమతి దాదాపుగా నిలిచిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో ప్రతి రోజూ నిత్యావసర వస్తువులతోపాటు, వస్త్రాలు, ఇతర సరుకులు సుమారు 500 లారీల దిగుమతులు జరిగేవి. ఇప్పుడు 25 లారీల సరుకు కూడా రావడం లేదు.
- ఇవే కాకుండా అమలాపురం, కాకినాడల్లో బంగారు దుకాణాలు ఖాళీగా దర్శినమిస్తున్నాయి.
- ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కార్ల అమ్మకాలు వంటివే కాదు.. చివరకు మాల్స్, హోల్‌సేల్‌ మార్కెట్లలో సహితం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చివరకు ఒక మోస్తరు హోటళ్లలో కూడా అమ్మకాలు పెద్దగా ఉండడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.
- దీనికితోడు జీఎస్‌టీపై స్పష్టత లేకపోవడంతో చాలామంది పెద్ద వ్యాపారులు విక్రయాలను దాదాపు నిలిపివేశారు. జీఎస్‌టీ పేరెత్తితే చిరు వ్యాపారులు సహితం వణికిపోతున్నారు.
పాత తేదీలతోనే అమ్మకాలు
ఈ నెల ఒకటిన నుంచి జీఎస్‌టీ అమలులోకి వచ్చినా పది రోజుల వరకూ వ్యాపారులను ఇబ్బంది పెట్టకూడదని, చూసీచూడనట్టుగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖాధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ధీమాతో కొంతమంది వ్యాపారులు మాత్రం పాత తేదీలతో విక్రయాలు జరుపుతున్నారు. స్థానికంగా కొంతమంది జీఎస్‌టీలో బిల్లులు కొడుతున్నా ఇవి పెద్ద హోటళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. పెద్దపెద్ద కంపెనీలు, హోల్‌సేల్‌ వస్త్ర, కిరాణా, ఇతర వ్యాపారులు జిల్లాకు తమ ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేశారు. కొందరు ఎగుమతులు చేస్తున్నా పాత తేదీల్లోనే బిల్లులు పంపుతున్నారు. దీంతో స్థానిక వ్యాపారులకు స్పష్టత రావడం లేదు.
>
మరిన్ని వార్తలు