చేనేతపై జీఎస్టీ పిడుగు

29 Jun, 2017 22:11 IST|Sakshi
చేనేతపై జీఎస్టీ పిడుగు

– చేనేత రంగంపై పన్నులు విధించడం ఇదే ప్రథమం
– పెరగనున్న ఉత్పత్తి వ్యయం
– ఎత్తివేయాలంటున్న నాయకులు


ధర్మవరం : దేశ ఆర్థిక వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి చేనేత రంగానికి పన్ను మినహాయింపు ఉంది. అలాంటిది జీఎస్టీలో చేనేత రంగాన్ని కూడా మిళితం చేయడంతో చేనేత పరిశ్రమపై కూడా పన్నుల భారం పడనుంది. అసలే ముడిసరుకుల ధరలు పెరిగి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత రంగాన్ని జీఎస్టీ మరిన్ని కష్టాల్లోకి నెట్టనుంది.  

పన్నుల మోత
ధర్మవరం, హిందూపురం, ముదిరెడ్డిపల్లి, సిండికేట్‌నగర్, ఉరవకొండ, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు దాదాపు లక్ష నుంచి 1.25 లక్షల వరకు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 40 వేల దాకా చేనేత  మగ్గాలు  ఉండగా, మరో 15 వేల దాకా మరమగ్గాలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా డైయింగ్, రీలింగ్, మగ్గం సామాన్ల విక్రయం, శిల్క్‌హౌస్‌లు, పాలిస్, డిజైన్‌ మేకింగ్, అట్టులు తయారీ తదితర వ్యాపారాలు ఉన్నాయి. జీఎస్టీ అమలైతే వస్త్రాలపై వివిధ దశల్లో 5, 12,18 శాతం వరకు పన్నులు పడనున్నాయి. అయితే రేషం గూడు నుంచి  తీసిన దారానికి (ముడిపట్టు) మాత్రమే జీఎస్టీలో పన్ను మినహాయింపు ఉంది. ముడిపట్టుకు రంగులు అద్దితే జీఎస్‌టీ పరిధిలోకి వచ్చేస్తుంది. అప్పటి నుంచి జరీ, రేషంలపై జీఎస్టీ భారం పడుతుంది. దీంతో పట్టు  చీర తయారయ్యేందుకు అయ్యే ఖర్చు దాదాపు 15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఆకాశంలో ధరలు
ప్రస్తుతం మార్కెట్‌లో ముడిపట్టు ధరలు కిలో రూ.4,000 నుంచి రూ.4,500 వరకు ఉన్నాయి. కిలో రేషానికి  రంగులు అద్దిచ్చేందుకు మరో రూ.300 దాకా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం సాధారణ  జరీ  మార్కు (నాలుగు బిల్లలు) రూ.400 నుంచి గరిష్టంగా రూ.1500 వరకు పలుకుతోంది. అదే జీఎస్టీ అమలైతే వాటిపైన 5 నుంచి 15 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. దాదాపు ఒక పట్టుచీర గతంలో రూ.4,000 లకు తయారయితే జీఎస్టీ తరువాత ఆ ఖర్చు రూ.4,500 నుంచి 4,800 వరకు పెరిగే అవకాశాలున్నాయి.
జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలి

చేనేత రంగంపై ఇప్పటి వరకు పన్నులు విధించిన దాఖలాలు లేవు. కొత్తగా పన్నులు విధించడం ఏంటని చేనేత సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే చేనేత రంగం సంక్షోభంతో కనుమరుగైపోతోందని, జీఎస్టీ అమలైతే చేనేతలు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. జీఎస్టీ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అందరూ పోరాడాల్సిందే
చేనేత రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని వైఎస్సార్‌సీపీ తరపున  కేంద్రాకిని విన్నవించాము. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించాము. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై అందరూ ఏకతాటిపై నిలబడి పోరాడాల్సిందే.
–గిర్రాజు నగేష్, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు

చేనేత రంగానికి పెద్ద దెబ్బ
జీఎస్టీ అమలు జరిగితే చేనేత రంగానికి తీవ్రనష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే చేనేతలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్‌తో ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్నాము.
- పోలా రామాంజినేయుడు, ఏపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు

మరిన్ని వార్తలు