గ్రానైట్‌కు జీఎస్టీ పాలిష్‌

5 Jun, 2017 22:50 IST|Sakshi
గ్రానైట్‌కు జీఎస్టీ పాలిష్‌

ఫినిష్డ్‌ గ్రానైట్‌ మార్బల్‌పై 28శాతం పన్ను
రా మెటీరియల్‌పై 12 శాతం
రిటైల్‌ మార్కెట్‌పై  తీవ్ర ప్రభావం
ఆందోళనలో పరిశ్రమ వర్గాలు


పాలిష్‌ చేసిన గ్రానైట్‌కు జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌) పెనుభారంగా మారింది. ఫినిష్డ్‌ గ్రానైట్‌పై 28 శాతం పన్ను విధించడంతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని గ్రానైట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు 2.5 శాతం మాత్రమే టాక్స్‌ రూపంలో   చెల్లించేవారు. అధిక పన్ను విధించడం వల్ల  గ్రానైట్‌కు డిమాండ్‌ తగ్గి మార్కెట్‌ కుప్పకూలుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యాలు     వాపోతున్నాయి.

చిత్తూరు, సాక్షి: పాలిష్‌ చేసిన గ్రానైట్‌కు జీఎస్టీ (గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌) పెంచ డం అటు యాజమాన్యాలకు, ఇటు కొనుగోలుదారులకు గుదిబండగా మారింది. గ్రానైట్‌ రా మెటీరియల్‌ (క్వారీ నుంచి తీసిన బండ)పై 12 శాతం, ఫినిష్డ్‌ గ్రానైట్‌ మార్బుల్‌ అమ్మకాలపై  28శాతం పన్ను శ్లాబులో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమల్లోకి రాక ముందు వ్యాట్‌ కింద కేవలం 14.5 శాతం మాత్రమే పన్ను చెల్లించేవారు. రాష్ట్రంలో అమ్మకాలు సాగిస్తే 14.5 వ్యాట్‌లో 12 శాతం ఇన్‌పుట్‌ సబ్సిడీగా తిరిగొస్తుంది. అంటే 2.5 శాతం మాత్రమే టాక్స్‌ రూపంలో యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం గుది బండ మోపడంతో గ్రానైట్‌ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

గ్రానైట్‌ యాజమాన్యాల     ఆందోళన ఎందుకంటే..
ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చిన రా మెటీరియల్‌ను ప్రాసెస్‌ చేసి తిరిగి మార్కెట్‌లో రీటైల్‌ లెక్కన విక్రయించాలంటే కొనుగోలుదారులు కచ్చితంగా 28 శాతం పన్ను చెల్లించాల్సిందే.     ఒక ఇంటి యజమాని రూ.2 లక్షల పాలిష్‌ చేసిన గ్రానైట్‌ను కొనుగోలు చేస్తే దానిపై రూ.5వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో టాక్స్‌ రూపంలో చెల్లించాలంటే సామాన్యుడు వెనకడుగువేసే అవకాశం ఉంది. పాలిషింగ్‌ యూనిట్ల నుంచి మెటీరియల్‌ ఎలా కదులుతుం దని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అధిక పన్ను విధించడం వల్ల సరుకు పేరుకుపోయి.. గ్రానైట్‌కు డిమాండ్‌ తగ్గి మార్కెట్‌ కుప్పకూలుతుందని ఫ్యాక్టరీ యాజమాన్యాలు పేర్కొం టున్నాయి. దీని ప్రభావం జిల్లాలోని దాదాపు 1000 గ్రానైట్‌ ఫ్యాక్టరీలపై పడనుందని అంటున్నారు.

అసంబద్ధ నిర్ణయం..
ఎగుమతి చేసే గ్రానైట్‌పై 28 శాతం జీఎస్టీ విధిస్తే పన్ను కట్టేందుకు రెడీగా ఉన్నాం. కానీ జిల్లాలో లభించేది నాసిరకం గ్రానైట్‌. దీనివల్ల గ్రానైట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు పెద్దగా మిగిలేదేమీ ఉండదు. ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం వల్ల ఫ్యాక్టరీలు మూసుకునే పరిస్థితి దాపురిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని చిన్నాచితక ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. కార్మికులు రోడ్డు న పడే అవకాశం ఉంది. ప్రభుత్వం పునరాలోచించాలి. తగిన కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
– విజయానందరెడ్డి,  మ్యాక్‌గ్రానైట్స్‌ అధినేత, చిత్తూరు

మరిన్ని వార్తలు