జీఎస్‌టీతో వాణిజ్యరంగం అతలాకుతలం

28 May, 2017 23:20 IST|Sakshi
జీఎస్‌టీతో వాణిజ్యరంగం అతలాకుతలం
– పెనాల్టీలు, జైలుశిక్ష వంటి నిబంధనలతో రక్షణ కరువు
– కేంద్ర ప్రభుత్వం దుందుడుకు చర్యలకు స్వస్తి పలకాలి
– ఏపీ ఫెడరేషన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ  
– రాజమహేంద్రవరంలో వర్తక సంఘాల మహాసభ 
దానవాయిపేట(రాజమహేంద్రవరం సిటీ) : కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి అమలులోకి తెస్తున్న జీఎస్‌టీ విధానంతో వాణిజ్యరంగం తీవ్ర సంక్షోభంలో పడుతుందని పలువురు వర్తక సంఘాల ప్రతినిధులు అందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని బొమ్మన రామచంద్రరావు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ట్రస్ట్‌ హాలులో జరిగిన వర్తక మహాసభకు రాజమహేంద్రవరం చాంబర్‌ అధ్యక్షుడు బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు అధ్యక్షత వహించగా, ఏపీ ఫెడరేషన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు, కన్వీనర్‌ అశోక్‌కుమార్‌ జైన్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో అర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వక్కలగడ్డ భాస్కరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆడిటర్‌ రాహుల్‌ జీఎస్‌టీపై వర్తకులకు పలు  సూచనలు ఇచ్చారు. భాస్కరరావు మాట్లాడుతూ  పెద్దనోట్ల  రద్దు అనంతరం కేంద్రం ప్రభుత్వం వాణిజ్య నిర్వహణలో నగదు లావాదేవీలు, చెల్లింపుల విషయంలో రూపొందించిన నిబంధనలు వర్తకుడిని అధఃపాతాళానికి తొక్కేలా ఉన్నాయని మండిపడ్డారు. జైన్‌ మాట్లాడుతూ అమ్మకందారుడు, కొనుగోలుదారుడికి మధ్య సంవత్సకాలంలో ఒకసారి లేక పలుమార్లు రూ.2 లక్షలు మించి నగదు లావాదేవీలు జరిపితే 100 శాతం జరిమానా, జైలు శిక్ష, ఇంట్లో నగదు నిల్వపై ఆంక్షల వంటి నిబంధనలతో  సామాన్య వర్తకులు భయాందోళనకు గురి అవుతున్నారన్నారు. రౌతు మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెస్తున్న కొత్త చట్టాలు వర్తకులను, వినియోగదారులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు. 30న హోటల్‌ యాజమాన్యాలు ఇచ్చిన బంద్‌ పిలుపుకు చాంబర్‌ మద్దతు తెలిపింది. జిల్లా ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ చైర్మన్‌ నందెపు శ్రీనివాస్, క్రెడాయ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, ఏపీ ఫెడరేషన్‌ చాంబర్‌ కోశాధికారి రామకృష్ణ, కాకినాడ చాంబర్‌ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, కోనసీమ చాంబర్‌ అధ్యక్షుడు సలాది నాగరాజు, తాడేపల్లిగూడెం చాంబర్‌ అధ్యక్షుడు గమిని సుబ్బారావు, అమలాపురం చాంబర్‌ అధ్యక్షుడు తాతాజీ,  రాజమండ్రి చాంబర్‌ మాజీ అధ్యక్షులు బొమ్మన రాజ్‌కుమార్, కొలేపల్లి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు