కాలువ వద్దే కాపలా

21 Aug, 2016 22:14 IST|Sakshi
కాలువ వద్దే కాపలా
బాల్కొండ: ఎస్సారెస్పీ నీటి కోసం రైతులు కావలి కాస్తున్నారు. నవాబు చెరువు నింపేందుకు ఉప కాలువల వద్ద కాపలా ఉంటున్నారు. వారబందీ ప్రకారం నీటి విడుదల కాకపోవడంతో, తమ చెరువు నింపుకొనేందుకు రైతులే కాల్వ వద్ద కాపు కాస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే డి–3 ద్వారా వేంపల్లి లిఫ్ట్‌కు నీరు చేరుతుంది. ఇక్కడి నుంచి నవాబు లిఫ్ట్‌ సరఫరా అవుతోంది. వారబందీ ప్రకారం వేంపల్లి లిఫ్ట్, నవాబు లిఫ్ట్, బోదేపల్లి లిఫ్ట్‌ ఆయకట్టు రైతులు నీటిని వంతుల వారీగా వినియోగించుకోవాలి. అయితే, నీటి వినియోగంపై రైతులకు అవగాహన లేకపోవడం, అధికారులు పట్టించుకోక పోవడంతో జల జగడాలు తలెత్తుతున్నాయి. వారబందీ ప్రకారం నీటి విడుదల కాకపోవడంతో రైతులు కాలువల వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
వారబందీ మేరకు రావాల్సిన నీటి కోసం నవాబ్‌ లిఫ్ట్‌ ఆయకట్టు రైతులు కాపలా కాస్తున్నారు. ఈ లిఫ్ట్‌పై ఆధారపడిన 11 గ్రామాల వీడీసీ సభ్యులు ప్రతి ఉప కాలువ తూము వద్ద కావలి ఉంటున్నారు. వేల్పూర్‌ మండలంలోని వేల్పూర్, అమీనాపూర్, లక్కోర, అంక్సాపూర్, పడగల్, సాహేబ్‌పేట్, కుకునూర్, కోమన్‌పల్లి, వెంకటపూర్, పోచంపల్లి, మోర్తాడ్‌ మండలం దొన్కల్‌ గ్రామస్తులు వంతుల వారీగా నీటి కోసం కాపలా కాస్తున్నారు అంక్సాపూర్, వేల్పూర్‌ నుంచి నలుగురు చొప్పున, మిగతా గ్రామాల నుంచి ముగ్గురు చొప్పున కాల్వల వద్ద ఉంటున్నారు. ఉదయం 7 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.
వంటావార్పు అక్కడే..
కాపలాకు వస్తున్న వారు కాలువ వద్దనే వంటావార్పు చేసుకుంటున్నారు. ఇంటి నుంచి వంట సామాను తెచ్చుకుని, ఇక్కడ రోజంతా ఉంటున్నారు. ప్రాజెక్ట్‌ అధికారులు నీటి పంపకాలు సక్రమంగా చేపడితే, ఇంత తిప్పలు ఉండేవి కాదని రైతులు పేర్కొంటున్నారు. వారబందీని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించినా, కొందరు రైతులు పట్టించుకోవడం లేదు. వర్షాలు కురవక కళ్ల ముందే పంటలు ఎండిపోతుండడంతో చేసేది లేక కాల్వల ద్వారా నీటిని మళ్లించుకుంటున్నారు. దీంతో చివరి ఆయకట్టు వరకు నీరందడం లేదు. ప్రాజెక్ట్‌ అధికారులు స్పందించి వారబందీ సక్రమంగా సాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 
 
వంట ఇక్కడనే చేసుకుంటున్నాం
నీల్ల కోసం కావలి వత్తున్నాం. పొద్దుగల్ల 7 గంటలకు వస్తే మళ్ల దినం 7 గంటల దాకా ఇక్కడనే ఉంటున్నాం. ఈడనే వంట చేసుకుని తింటున్నాం. కావలి లేకుంటే నీల్లు మాదాక అత్తలేవు.
– గంగారాం, అంక్సాపూర్‌
 
వంతుల వారీగా వత్తున్నాం
నవాబు లిఫ్ట్‌ ద్వారా 11 ఊళ్లలో పంటలు పండుతాయి. 11 ఊళ్ల నుంచి వంతుల వారీగా వచ్చి ఇక్కడ కావలి వస్తున్నాం. రాత్రి ఇక్కడనే ఉంటున్నాం. వోల్ల వంతుల వాళ్లు నీల్లు కట్టుకుంటే తిప్పలు ఉండవు. 
–  భూమన్న, అంక్సాపూర్‌
 
నవాబు చెరువును నింపాలి
నవాబు చెరువు నింపితేనే మాకు నీళ్లు వస్తాయి. అందుకే, రాత్రి పగలు కాలువ కాడనే కాపల కాస్తున్నాం. ప్రాజెక్ట్‌ సార్లు చెప్పినట్లు వింటే మాకు రాత్రి కాపల కాసే బాధ తప్పేది. నీళ్లకు బాగా తిప్పల అవుతుంది.  
– సాయన్న, వేల్పూర్‌ 
మరిన్ని వార్తలు