క్రియాశీలకంగా ‘గుడా’

27 May, 2017 22:00 IST|Sakshi
– చైర్మన్, వైస్‌ చైర్మన్‌ నియామకంతో కార్యకలాపాలు వేగవంతం 
–‘గుడా’ పరిధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌
– ప్రత్యేకాధికారిగా సంజయ్‌రత్నకుమార్‌ 
– రాజమహేంద్రవరంలో జోనల్‌ కార్యాలయం
సాక్షి, రాజమహేంద్రవరం : కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(గుడా) కార్యకలాపాల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. గుడా చైర్మన్‌గా టీడీపీ సీనియర్‌ నేత గన్ని కృష్ణను నియమించిన ప్రభుత్వం కాకినాడలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. తాజాగా రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ రెవెన్యూ కార్యాలయంలో గుడా జోనల్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గుడాకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపాందించేందుకు నియమించిన ప్రత్యేక అధికారి సంజయ్‌రత్నకుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. వైస్‌ చైర్మన్‌గా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గుడా పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించి మంగళవారం వైస్‌ చైర్మన్‌ విజయరామరాజు అధ్యక్షతన మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుడా పరిధిలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు నగరపంచాయతీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, టౌన్‌ప్లానింగ్‌ విభాగం రీజనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబా, గుడా మాస్టర్‌ప్లాన్‌ తయారీ ప్రత్యేక అధికారి సంజయ్‌రత్నకుమార్‌ హాజరయ్యారు. గుడా పరిపాలనపై కమిషనర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు  వైస్‌ చైర్మన్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అ«థారిటీస్‌ చట్టం–2016 కింద జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం నగరపాలక, పురపాలక సంఘాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఇక నుంచి గుడా పరిధిలో భవనాల నిర్మాణం, ఇతర అనుమతుల కోసం గుడాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం గుడా వారికి అనుమతులు మంజూరు చేస్తుంది. అంతేకాక పురపాలక శాఖ విడుదల చేసిన జీవో 439 ప్రకారం నగర, పురపాలక సంఘాలు అభివృద్ధి చార్జీలు, బిల్డింగ్‌ ఫీజులు, లే అవుట్ల అనుమతులకు ఫీజులు ఆయా సంఘాలు గుడాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి కొత్త నిర్మాణాలు, లే అవుట్లు చేపట్టాలంటే గుడా అనుమతి తప్పనిసరి. గుడా పరిధిలో లే అవుట్లు, భవనాల నిర్మాణాలకు ప్లాన్లు తయారు చేసే లైసెన్స్‌ సర్వేయర్లు తమ పేర్లు తప్పనిసరిగా గుడా వద్ద నమోదు చేయించుకోవాలని వైస్‌ చైర్మన్‌  తెలిపారు.
ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు చర్యలు
గుడా పరిధిలోని ప్రాంతాలకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ తయారు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందు కోసం రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఉన్న ప్లానింగ్‌ అధికారి సంజయ్‌రత్నకుమార్‌ను గుడా ప్లానింగ్‌ అధికారిగా నియమించింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైస్‌ చైర్మన్‌ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ కావడంతో ఇక్కడే ఉంటున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ను రూపాందించిన అనుభవం కమిషనర్‌కు ఉండడం గుడా మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు ఉపయోగపడనుంది. గుడాకు మాస్టర్‌ప్లాన్‌ రూపాందించి అమలు చేస్తే కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య అభివృద్ధి వేగవంతం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
మరిన్ని వార్తలు