శిరీషకు గన్‌మెన్

6 Apr, 2016 23:21 IST|Sakshi
శిరీషకు గన్‌మెన్

ఏజెన్సీ పర్యటనలో అవసరం అంటూ శివాజీ దరఖాస్తు
  సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీషకు ప్రభుత్వం గన్‌మెన్‌ను కేటాయించింది. మందస, కాశీబుగ్గ, సీతంపేట లాంటి ఏజెన్సీతో పాటు శివారు ప్రాంతాలకు వెళ్లే సమయంలో తన కుమార్తె ఒంటరిగానే వెళ్లాల్సివస్తోందని, భద్రతా ప్రమాణాల దృష్ట్యా గన్‌మెన్ కేటాయించాలని కొన్నాళ్ల క్రితం శిరీష తండ్రి, పలాస ఎమ్మెల్యే శివాజీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీకి విన్నవించిన నేపథ్యంలో కొన్నాళ్ల నుంచి ఆమెకు జిల్లా పోలీస్‌శాఖ గన్‌మెన్‌ను కేటాయిస్తూ వచ్చింది.

 ఏజెన్సీల్లో పర్యటించే సమయంలో తమ అనుమతి లేకుండా వెళ్లొద్దని పోలీస్‌శాఖ గతంలో శిరీషను పలుమార్లు హెచ్చరించింది.  ఓ ఆడపిల్లకు భద్రత అవసరం అంటూ శివాజీ కూడా కోరిన మీదటే గన్‌మెన్‌ను కేటాయించాం అని పోలీసు వర్గాలు తెలిపాయి. సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్‌ఆర్‌సీ) తీసుకున్న నిర్ణయం మేరకే భద్రతను ఇచ్చామని ఓ అధికారి స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆమె పర్యటించే సమయంలో భద్రత కేటాయించాలని హోంశాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే గన్‌మెన్‌ను ఇచ్చామని ధ్రువీకరించారు.
 
 నిబంధనల ప్రకారం శిరీష పోలీస్‌శాఖకు యూజర్ చార్జీలు చెల్లించాల్సిందేనని తెలిసింది. కాగా, తాను గన్‌మెన్ పర్యవేక్షణలోనే ఏజెన్సీలో పర్యటిస్తున్నానని, పల్లపు ప్రాంతానికి వచ్చేసరికి మాత్రం గన్‌మెన్‌ను తిరిగి పోలీస్‌శాఖకు అప్పగించేస్తున్నానని శిరీష స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు