ఘంటా మఠం.. ధనరాశుల గని

12 May, 2017 23:05 IST|Sakshi
ఘంటా మఠం.. ధనరాశుల గని
- స్కంద పురాణంలో ఘంటా మఠం ప్రస్తావన
- రూ. కోట్ల విలువ చేసే గుప్తనిధులు ఉన్నాయని నమ్మకం
- శిఖర రాయి కింద నిధుల అదృశ్యంపై అంతటా చర్చ
   
శ్రీశైలం: శ్రీశైల దేవస్ధానం పరిధిలోని పంచ మఠాలలో ఒకటైన ఘంటామఠంలో జరుగుతున్న జీర్ణోధ్ధరణ పనుల్లో విలువైన గుప్త నిధులు బయటపడటంతో అత్యంత ప్రాచీనత ఈ మఠం విశిష్టిత మరో సారి వెలుగులోకి వచ్చింది. ఘంటా మఠం ప్రాధాన్యత దృష్ట్యా ఈ మఠంలో ఉన్న లింగస్వరూపాన్ని ఘంటా సిద్దేశ్వరుడిగా పిలుస్తారు. ఇక్కడ ఒక భారీ కంచు గంట కూడా ఉంది. దీన పక్కనే నీటిగుండాన్ని ఘంటా గుండంగా పిలుస్తారు. ఇందులో ఉన్న నీటితో ఘంటా సిద్దేశ్వరస్వామిని ప్రదోష కాలం పూర్తయిన తరువాత నుంచి నాలుగు జాములు ఏకధాటిగా గంట మోగిస్తూ  ఘంటా గుండంలోని నీటితో అభిషేకించడం ద్వారా ఖేచరత్వం (ఆకాశగమనం) సిద్ధిస్తుందని స్కందపురాణం ద్వారా తెలుస్తోంది.
 
అలాగే రసరత్నాకారంలో ఈ ఘంటామఠంలో అనేక నిధులున్నట్లు రాయబడిందని కొందరు చెబుతున్నారు. అందుకే గుప్తనిధుల వేటగాళ్ల చూపులన్ని ఎప్పటి నుంచో ఈ గంటా మఠం వైపే ఉంటాయి.  శ్రీమల్లికార్జునస్వామివార్ల ఆలయం ముందు భాగంలోని అంతరాలయంలో ఎలాంటి గుండ్రటి రాతి బండ ఉందో అలాంటిదే ఘంటా సిద్ధేశ్వరస్వామి ముందు ఉన్న అంతరాలయంలో కూడా ఉంది. ఈ బండ కిందనే కోట్ల విలువ చేసే నిధులు ఉన్నాయని అభిప్రాయం అనేక మందిలో నెలకొంది. మూడు రోజుల క్రితం తవ్వకాల్లో సుమారు 140 వెండి నాణాలు, 14 బంగారు నాణాలు, 3 బంగారు కడియాలు, ఉంగరాలు, 2 వెండి చెంబులు ఈ తవ్వకాలలో లభించాయి,  ఇందులో మూడు బంగారు కడియాలు ఉంగరాల బరువు.మోత్తం 699 గ్రాముల 930 మిలీగ్రాములు  కాగా వెండి నాణేలు ఇతర వస్తువులు కాలిపి 2కేజీల 500 గ్రాములు ఉన్నాయి.  
 
గతంలోనే వేటగాళ్ల తవ్వకాలు
శ్రీశైల ఆలయ ప్రాకార కుడ్యానికి వాయువ్య దిశలో పంచమఠాలు ఉన్నాయి. ఇందులో ఘంటామఠం, విభూది మఠాలలో గుప్తనిధులు ఉన్నాయని ఎన్నో ఏళ్లుగా ప్రచారంతో ఉంది. అయితే దాదాపు 20 ఏళ్ల క్రితం కొందరు దుండగులు విభూది మఠంలో వున్న విగ్రహాలను ధ్వంసం చేసి మఠం మధ్య భాగంలో ఉన్న బీజాక్షరాలు కలిగిన గ్రానైట్‌ శిలా ఫలకాన్ని పగలగొట్టారు. దాని కింద ఉన్న లక్షల విలువైన నిధులను దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే సారంగధర మఠంలో కుడా లక్షల విలువైన గుప్త నిధులను కొందరు స్వాహా చేశారు. ఘంటా మఠం పరిసర ప్రాంతాలో తవ్వకాలు జరిగాయి. కానీ మఠంలో ఉన్న ఘంటాసిద్ధేశ్వర స్వామి మూల విరాట్, అంతర ఆలయంలో వున్న గుండ్రటి శిలా ఫలకం , దాని కింద ఉన్న కోట్లాది విలువ చేసే ధన రాశుల కోసం గుప్తనిధుల వేటగాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానికులు తిప్పికొట్టిన సందర్భాలు ఉన్నాయి.
 
ఎన్నో అనుమానాలు
సాధరాణంగా గర్భాలయ కలశం ప్రతిష్ట  చేసేటపుడు అ కలశం కింద నవరత్నాలు బంగారు వెండి రాగి వస్తువులు బీజ అక్షరాలలో ఉన్న రేకులను పెట్టి కలశ ప్రతిష్ట చేయడం ప్రాచీన కాలం నుంచి నేటి వరకు  జరిగే  శాస్రోక్తంగా చేసే క్రతువు. దీని బట్టి చూస్తే ఘంటామఠం గర్బాలయ కలశం ప్రతిష్ట చేసేటపుడు కుడా ఇదే విధంగా చేసి ఉంటారు. అయితే గర్భలయ శిఖర కలశాన్ని రాతితో నిర్మించినందువల్ల ఆ రాయి కిందే ఈ క్రతువు జరిగి ఉంటుంది. కొంతకాలం క్రితం కొందరు దుండగులు కలశాన్ని ధ్వంసం చేసినా వారికి ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. ఎందుకంటే కలశంతో సహా పైరాయి నిర్మాణం ఉంటుంది. జీర్ణోద్ధరణలో బాగంగా ఘంటామఠ ఆలయ  కలశరాయిని తొలగించినప్పుడు దాని కింద కచ్ఛితంగా కాసులు ఉంటాయని అభిప్రాయం ఉంది. పునఃరుద్ధరణ లో భాగంగా ఆ రాయిని తొలగించినపుడు అక్కడ ఉన్న కాసులు ఏమైన్నట్లుని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా ఆ కలశం కింద దొరికిన వాటిని కొందరు ఒక వాహనంలో వచ్చి తీసుకువెళ్లిన్నట్లుగా అక్కడ స్థానికులు చర్చించుకుంటున్నారు.
 
నిఘా నామమాత్రం:
 శిథిలావస్థలో ఉన్న ఘంఠామఠం, వీరభద్ర మఠాలను శ్రీశైల దేవస్థానం జీర్ణోద్ధరణ చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా కొన్ని నెలలుగా తవ్వకాలను చేపట్టింది. కాగా గుప్తనిధులు ఉన్నాయని ప్రచారం ఉన్న ఘంటామఠం వద్ద దేవస్థానం నిఘా కెమెరాలను, ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అయితే అక్కడ నామమాత్రాంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆలాగే జీర్ణోధ్ధరణ పనులను పరిశీలిచడానికి ప్రత్యేకంగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయలేదు. ఘంటామఠం వద్ద పురాతన గుప్త నిధులు బయట పడడంతో రెండురోజుల క్రితం పురావస్తు అధికారులు శ్రీశైలం చేరుకొని తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. వారి సూచన మేరకు నిఘా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.  
 
మరిన్ని వార్తలు