ఆర్టీసీకి రోజుకు రూ.40 లక్షలు నష్టం

29 Sep, 2016 20:20 IST|Sakshi
ఆర్టీసీకి రోజుకు రూ.40 లక్షలు నష్టం
 
  •  గుంటూరు ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి 
 
సత్తెనపల్లి(గుంటూరు): రీజియన్‌లో ఆర్టీసీకి రోజుకు రూ. 40 లక్షలు నష్టం వాటిల్లుతోందని ఆర్టీసీ గుంటూరు రీజినల్‌ జ్ఞానంగారి శ్రీహరి చెప్పారు. గురువారం సత్తెనపల్లి ఆర్టీసీ డిపోలో సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మాచర్ల డిపోల మేనేజర్లు, అధికారులతో నిర్వహించిన  సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్‌కు రోజుకు 1.40 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, రూ. కోటి మాత్రమే వస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 డిపోలు నష్టాల్లో ఉన్నాయని వీటిలో పిడుగురాళ్ళ ప్రథమస్థానంలో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాచర్ల డిపో నష్టాల్లో ఉందని ఇది జీర్ణించుకోలేని విషయమన్నారు.  ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ మనుగడే ప్రశ్నార్థంగా మారుతుందన్నారు.  కార్మికులు, ఉద్యోగులు, సమన్వయంతో పనిచేసి ఆదాయం పెంచాలన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్ళకుండా నియంత్రించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  ఆర్టీసీ పరిరక్షణకు, ప్రై వేటు వాహనాల నియంత్రణకు ప్రత్యేక స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు.   జిల్లాను పది మైక్రోటీమ్‌లుగా విభజించి మూడు డిపోలకు ఒకరు చొప్పున పర్యవేక్షకులను నియమించామన్నారు.  ట్రాఫిక్‌ ఇన్‌చార్జిలు, డిపో మేనేజర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా రోడ్లపైకి రావాలని, ప్రయాణికులు ఆర్టీసీలో వెళ్ళేలా చూడాలన్నారు. సమావేశంలో నర్సరావుపేట డెప్యూటీ సీటీఎం చెవల వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి డిపో మేనేజర్‌ సీ.బాలాజీ దయాళ్, పిడుగురాళ్ళ డిపో మేనేజర్‌ ఈశ్వరరావు, మాచర్లడిపో మేనేజర్‌ శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు