పద్యాలతో జాషువాకు పట్టాభిషేకం

24 Sep, 2016 20:15 IST|Sakshi
పద్యాలతో జాషువాకు పట్టాభిషేకం
గుంటూరు ఈస్ట్‌: మహాకవి గుర్రం జాషువాకు శనివారం గుంటూరులో ఆయన రచించిన పద్యాలతోనే పట్టాభిషేకం జరిగింది. పలువురు కవి గాయకులు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా పద్యాలు రసరమ్యంగా ఆలపించి పరవశించారు. పలువురు సాహితీమూర్తులు విశ్వనరుడు జాషువాను విశ్వమానవ గోత్రీయుడంటూ కొనియాడారు. ఆయన సామాజిక స్ఫూర్తి భవిష్యత్‌ తరాలకు అందించాలని ఆకాంక్షించారు. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 121వ జయంతి వారోత్సవాలలో మూడోరోజు శనివారం పోలీస్‌ కల్యాణ మండపంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌తో పాటు 50 మంది కవులు,రచయితలను సత్కరించి,జాషువాకు సాహిత్య నీరాజనం అర్పించారు. వందమంది కవులు రచించిన కవితల సంకలనం అయిన ‘‘వందగొంతులు ఒక్కటై జాషువా కోసం’’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రముఖ గాయకులు గజల్‌ శ్రీనివాస్, నరాలశెట్టి రవికుమార్,బండారు పద్మ, దేవసహాయం, బద్వేలు శ్రీహరి, ప్రజానాట్య మండలి గాయకుడు రమణ తదితరులు జాషువా పద్యాలను ఆలపించిన తీరు ఆహూతులను అలరించింది. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌ను కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, సాహితీవేత్తలు డాక్టర్‌ బూసురుపల్లి వెంకటేశ్వర్లు,ధనేకుల వెంకటేశ్వర్లు,పెనుగొండ లక్ష్మీనారాయణ,పాపినేని శివశంకర్‌ ఘనంగా సత్కరించారు.అనంతరం పద్మశ్రీ ఇనాక్‌ రచించిన అమరావతి,పులుల బోను–నేను, సర్పయాగం, అమరావతి ఖ్యాతి మాదిగల స్థితి పుస్తకాలను ఆవిష్కరించారు. 
 
జిల్లాకు జాషువా పేరు పెట్టాలి..
పలువురు వక్తలు తమ ప్రసంగాలలో గుంటూరు జిల్లాకు గుర్రం జాషువా పేరుపెట్టాలని, నవ్యాంధ్రలో ఆయన పేరుమీదగా లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహణకు హాలును నిర్మించాలని కోరారు. జాషువా గొప్ప మానవతా వాది అని, సమాజ దార్శనికుడని ఎందరో ఆధునిక కవులకు మార్గదర్శకుడయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కన్నా మాస్టారు, వేదయ్య,న్యాయవాది వైకే, చందోలు శోభారాణి, సముద్రాల కోటేశ్వరరావు, బత్తుల వీరాస్వామి,జాషువా సంఘం అధ్యక్షుడు పెద్దింటి యోహాను  తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు