టీఆర్‌ఎస్‌లోకి గుత్తా?

4 Jun, 2016 03:05 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లోకి గుత్తా?

- మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా..!
- గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్లు గుత్తా వెల్లడి
- యాదాద్రి ప్లాంటు, జిల్లాల విభజనపై చర్చించామని వివరణ
- గులాబీ పార్టీలో చేరికపై మంతనాలు జరిపినట్లు సమాచారం
- ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా.. ఆ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారా..ఆయనతోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కరరావు కూడా టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారా.. ఈ ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ చేరికలకు సంబంధించి కసరత్తు కూడా పూర్తయిందని... టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. గుత్తా, భాస్కరరావు గురువారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం, శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశం పెట్టి కేసీఆర్‌ను సమర్థించే వ్యాఖ్యలు చేయడం దీనిని బలపరుస్తున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో ఉన్నా..!
 రాష్ట్రంలో తొలి నుంచీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తరఫున విమర్శలు గుప్పించిన నేతల్లో ఎంపీ గుత్తా ముందుంటారు. కానీ పలు కారణాల నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నల్లగొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓ ప్రశ్నకు గుత్తా చెప్పిన సమాధానం దీనిని బలపరుస్తోంది. ‘మీరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించ గా.. ‘‘నేను ప్రస్తుతానికి కాంగ్రెస్‌లోనే ఉన్నా.. భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు.’’ అని గుత్తా వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకాదు సీఎం కేసీఆర్‌ను తాను, ఎమ్మెల్యే భాస్కరరావు కలిసినట్లు ఆయనే స్వయంగా చెప్పా రు. యాదాద్రి పవర్ ప్లాంటు, జిల్లాల విభజన అంశాలపై సీఎంతో మాట్లాడామన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ హర్షణీయమని, ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు కేసీఆర్‌కు మద్దతిస్తామని పేర్కొన్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరే విషయంపై వారు ప్రధానంగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తాను ఎంపీ పదవికి రాజీనామా చేశాకే టీఆర్‌ఎస్‌లో చేరుతానని గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం.

 జిల్లా నేతలకు గాలం..?
 నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు టీఆర్‌ఎస్‌లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లా నేతల్లో సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ ఉప నాయకుడు కోమటిరెడ్డి ఉండడం, మరో ఎమ్మెల్యే పద్మ పీసీసీ అధ్యక్షుడి సతీమణి కావడం, భాస్కరరావు సీఎల్పీ నేతకు ముఖ్య అనుచరుడు కావడంతో అంతా కాంగ్రెస్‌లోనే ఉండాల్సిన పరిస్థితులు కొనసాగాయి. కానీ సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలోనే పలుమార్లు పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. స్థానిక రాజకీయాలతో పాటు వెంకటరెడ్డి సోదరుడు ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలవడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావులను టీఆర్‌ఎస్ టార్గెట్ చేసిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
 
 హరీశ్‌రావుతో గుత్తా భేటీ?
 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల మంత్రి హరీశ్‌రావుతో రహస్యంగా సమావేశమైనట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే భాస్కరరావు, గుత్తాకు సన్నిహితుడైన ఎంపీపీ పి.రాంరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నట్టు సమాచారం. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ భేటీని సమన్వయం చేశారని, గుత్తా బంధువైన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ నివాసంలో ఈ భేటీ జరిగిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి సమీప బంధువుకు చెందిన సంస్థకు రాష్ట్రంలో పలు కాంట్రాక్టులు దక్కాయి. ఆ పనులు అవాంతరాల్లేకుండా సాగాలంటే టీఆర్‌ఎస్‌లో చేరక తప్పదనే ఒత్తిడి వచ్చినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు