'మీ రెండు సీట్లతో తెలంగాణ సాధ్యమయ్యేదా?'

20 Mar, 2016 10:57 IST|Sakshi
'మీ రెండు సీట్లతో తెలంగాణ సాధ్యమయ్యేదా?'

నల్గొండ : టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్గొండలో గుత్తా విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వొద్దని హుడ్కోకు తాను లేఖ రాయలేదని స్పష్టం చేశారు. ఎస్టిమేషన్ సరిగ్గా లేదని... ఈ నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని మాత్రమే తాను లేఖ రాసినట్లు గుత్తా సుఖేందర్రెడ్డి వివరణ ఇచ్చారు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని... కేసీఆర్ అప్పుల ఊబిగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో మిషన్ భగీరథకు కానీ... డబుల్ బెడ్రూమ్ కానీ పైసా కేటాయించలేదని గుత్తా కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని గుత్తా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కానీ... అభివృద్ధి ముసుగులో అవినీతికి... అలాగే తెలంగాణ ముసుగులో ఆంధ్ర పాలన సాగిస్తున్న దానికే వ్యతిరేకమని గుత్తా పేర్కొన్నారు. అయితే మిషన్ భగీరథకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఎస్టిమేషన్లో మాత్రం తప్పు ఉందని... వాటిని పరిశీలించి లోన్ ఇవ్వాలని మాత్రం హుడ్కో కి రాసిన లేఖలో పేర్కొన్నానని చెప్పారు.  అలాగే 2009 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి స్థానాలు 2 మాత్రమే ఉన్నాయి. ఆనాడు టీ కాంగ్రెస్ ఎంపీలంతా ఒక్కటిగా ఉండి.. పార్టీ అధిష్టానానికి ఇబ్బంది అయినా పార్లమెంట్లో తెలంగాణ పక్షాన  పోరాడి.. ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చామని తెలిపారు. అలా వచ్చిన రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటామా అని టీఆర్ఎస్ ను ప్రశ్నించారు.  

పార్లమెంట్లో మా గళం,మా మద్దతు లేకపోతే మీ రెండు సీట్లతో తెలంగాణ రాష్ట్రం సాధ్యం అయేదా! అసలు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక పోతే తెరాస పార్టీ ఎక్కడిది...మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ,థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కడివి అంటూ పాలక టీఆర్ఎస్ కి ప్రశ్నలు సంధించారు. బంగారు తెలంగాణ కోసం ,అమరవీరుల త్యాగాలు వృధా కాకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 ఎన్నికలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇస్తే బంగారు తెలంగాణ బదులు అప్పుల తెలంగాణ చేసి ప్రజలపై లేని భారం వేస్తున్నారని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర పాలనా ముసుగులో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పరిపాలన టీఆర్ఎస్ సాగిస్తుందని దీనిని ఖండిస్తున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు