‘గూడు’పుఠాణి

18 Jul, 2016 00:09 IST|Sakshi
‘గూడు’పుఠాణి
ఇళ్లు ఎగరేసుకుపోయిన మంత్రి
సగానికి పైగా యనమల సొంత నియోజకవర్గానికే..
జిల్లాకు ప్రభుత్వం కేటాయించినవి 9,995
అమాత్యుని ఖాతాలో వేసుకున్నవి 5,904
మిగిలిన ఎమ్మెల్యేలకు నామమాత్రపు కేటాయింపులు
తునిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వని వైనం
అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇళ్లు ఇచ్చేస్తాం, రుణాలు ఇచ్చేస్తాం, రేషన్‌కార్డులు ఇస్తామంటూ ఇప్పటివరకూ టీడీపీ ఎమ్మెల్యేలు నమ్మబలికారు. తీరా ఆచరణకు వచ్చేసరికి పరిస్థితి వేరేలా ఉంది. మిగిలినవాటి మాటేమో కానీ ఇళ్ల మంజూరు విషయంలో వారి మాటకు గడ్డిపోచపాటి విలువ కూడా లేకుండా పోయింది. జిల్లాకు మంజూరైన ఇళ్లల్లో సగానికి పైగా రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల 
రామకృష్ణుడు ఎగరేసుకుపోయారు. దీనిపై ‘దేశం’ ఎమ్మెల్యేలే కారాలూ మిరియాలు నూరుతున్నారు.
సింహభాగం యనమలకే.
జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ పక్కకు నెట్టేసి, మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లాకు మంజూరైన ఇళ్లలో సగానికి పైగా ఇళ్లను తన సొంత నియోజకవర్గం తునికి ఎగరేసుకుపోయారు. జిల్లా అంతటికీ కలిపి 9,995 ఇళ్లు మంజూరైతే యనమల ఒక్కరే 5,904 ఇళ్లు తన ఖాతాలో వేసేసుకున్నారు.
డిప్యూటీ సీఎంకూ మొండిచెయ్యే..
ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు కూడా ఇళ్ల కేటాయింపులో మొండిచెయ్యే చూపారు. అటు సొంత నియోజకవర్గం అమలాపురానికి కానీ, ఇటు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురానికి కానీ యనమల స్థాయిలో ఇళ్ల కేటాయింపులు చేసుకోలేక రాజప్ప చేతులెత్తేశారు. అమలాపురానికి 127, పెద్దాపురానికి 213 ఇళ్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉండి కూడా రాజప్ప తన రెండు నియోజకవర్గాలకూ తన హోదాకు తగిన స్థాయిలో ఇళ్లు కేటాయించుకోలేకపోయారని స్థానికులు విమర్శిస్తున్నారు. కారణమేమిటో తెలీదు కానీ.. ఒక్క రామచంద్రపురం నియోజకవర్గానికి మాత్రం 1,133 ఇళ్లు కేటాయించడం గమనార్హం.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
చంద్రబాబు ప్రభుత్వంలో నంబర్‌–2గా ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవహార శైలి సొంత పార్టీ ఎమ్మెల్యేలకే మింగుడుపడటం లేదు. జిల్లాకు సంబంధించి కీలక నిర్ణయాలు జరిగేటప్పుడు అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ఆయనపై ఉన్నాయి. తాజాగా నిరుపేదలకు ఇళ్ల మంజూరులో కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికీ 1250 ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు గతంలో ప్రకటించారు. అయితే దీనికింద సిటీ నియోజకవర్గాలకు ఇళ్లు కేటాయింపు లేదు. జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో రెండు సిటీ నియోజకవర్గాలు. మిగిలిన 17 నియోజకవర్గాలకు కలిపి 21,250 ఇళ్లు రావాలి. కానీ చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. గత ఏప్రిల్‌ నెలలో జిల్లాకు మొక్కుబడిగా 9,995 ఇళ్లు మంజూరు చేసి చేతులు దులుపేసుకున్నారు. అంటే 11,255 ఇళ్లకు కత్తెర వేశారు. పోనీ మంజూరైన ఇళ్లనైనా అన్ని నియోజకవర్గాలకూ సమానంగా కేటాయించలేదు. అలా జరిగి ఉంటే ప్రతి నియోజకవర్గానికి 587 ఇళ్లు వచ్చేవి.
ఇవేవీ పట్టించుకోకుండా.. ఎమ్మెల్యేలనందరినీ కాదని సగానికి పైగా ఇళ్లు పట్టుకుపోయిన యనమల.. పోనీ అక్కడ ప్రజల మద్దతుతో ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఏమైనా ప్రాధాన్యం ఇచ్చారా అంటే అదీ లేదు. తన అనుచరగణానికి, తెలుగు తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకే మంత్రి ఈవిధంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పలు హోదాల్లో పని చేసిన యనమల కూడా ఒకప్పుడు ఎమ్మెల్యేనే కదా! ఎమ్మెల్యేగా నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటారో ఆయనకు ప్రత్యేకించి చెప్పాలా?’ అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
 
నియోజకవర్గాల్లో ఎలా తిరగాలి?
చంద్రబాబు ప్రకటనతో నియోజకవర్గాల్లో ప్రజల నుంచి తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్నారు. సీఎం చెప్పిన ప్రకారం నియోజకవర్గానికి 1,250 ఇళ్లు వస్తాయని భావిస్తున్న ప్రజలు.. ఇళ్ల కేటాయింపుల కోసం ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. ‘ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క ఇల్లూ ఇవ్వలేదు. వారికి మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని కోనసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే అన్నారు. అసలే అరకొర కేటాయింపులు.. అందులోనూ యనమలకు ప్రత్యేక కోటా అంటే ఇక నియోజకవర్గాల్లో తాము ఎలా తిరగాలని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు మంజూరైన ఇళ్లను నియోజకవర్గాలకు సమానంగా కేటాయిస్తారని ఎదురుచూస్తే.. సగానికి పైగా ఇళ్లను యనమల లాగేసుకోవడంపై మిగిలిన ఎమ్మెల్యేలు కస్సుబుస్సుమంటున్నారు. ‘పలుకుబడి ఉంది కదా అని ఇలా ఇళ్లన్నీ ఎగరేసుకుపోతే మాలాంటివాళ్లం ఏం చేయగలుగుతాం?’ అని కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గద్దెనెక్కాక పేదలకు ఒక్క ఇల్లూ ఇవ్వలేకపోయామనే బాధ కంటే అందరికంటే యనమల ఎక్కువ ఇళ్లు పట్టుకుపోవడాన్ని మెజార్టీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. తునిలో ప్రజా వ్యతిరేకతతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన యనమల.. ఇలా ఇళ్లు ఎగరేసుకుపోవడం పార్టీ జిల్లా నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
 
మొక్కుబడి కేటాయింపులు
జిల్లాకు ప్రభుత్వం మొక్కుబడిగా 9,995 ఇళ్లు మంజూరు చేసింది. నియోజకవర్గాల వారీగా.. తుని 5,904, రామచంద్రపురం 1,133, ప్రత్తిపాడు 526, మండపేట 404, అనపర్తి 329, పెద్దాపురం 213, జగ్గంపేట 203, రాజోలు 162, కాకినాడ రూరల్‌ 157, పి.గన్నవరం 156, పిఠాపురం 141, రాజమహేంద్రవరం రూరల్‌ 134, అమలాపురం 127, కొత్తపేట 125, రంపచోడవరం 123, ముమ్మిడివరం 118, రాజానగరం 40 చొప్పున ఇళ్లు కేటాయించారు.
 
మరిన్ని వార్తలు