పాతాళానికి గంగ

2 May, 2017 00:49 IST|Sakshi
పాతాళానికి గంగ
 భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గోదావరి నది చెంతనే ఉన్నా.. ఊరూరా కాలువలు పారుతున్నా పాతాళ గంగ అథఃపాతాళానికి వెళ్లిపోయింది. డెల్టాలో పరిస్థితి కొంత బాగానే ఉన్నప్పటికీ.. మెట్ట, పాక్షిక మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :ఓ వైపు గోదావరి.. మరోవైపు సముద్రం ఉన్నా జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో సగటున 14 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, మన జిల్లాలో 20 మీటర్లకు పైగా లోతుకు పడిపోయాయి. ఎండలు ఇదేస్థాయిలో ఉంటే మే నెలాఖరు నాటికి నీటి మట్టాలు మరింత అట్టడుగుకు వెళ్లిపోయే పరిస్థితి ఉంది. కొయ్యలగూడెంలో 75 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు దిగిపోయాయి. డెల్టా ప్రాంతంలోని 9.20 శాతం భూభాగంలో 3 మీటర్లలోపు నీటి మట్టాలు ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 24.6 శాతం భూభాగంలో 3నుంచి 8 మీటర్ల మధ్య నీటిమట్టాలు ఉన్నాయి. 66.20 శాతం భూభాగంలో అంటే.. సగానికంటే ఎక్కువ విస్తీర్ణంలో భూగర్భ జలాలు 8 మీటర్లకన్నా దిగువన ఉన్నాయి. దెందులూరు మండలం చల్లచింతలపూడిలో 54.765 మీటర్లు, ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో 70.636 మీటర్లు, ఉంగుటూరు మండలం నారాయణపురంలో 59.421 మీటర్ల దిగువకు నీటిమట్టాలు పడిపోయాయి. నల్లజర్ల మండలం దూబచర్లలో 56.16 మీటర్లు, పెదవేగి మండలం ముండూరులో 42.164 మీటర్లు, విజయరాయిలో 36.773 మీటర్లు, తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో 48.42 మీటర్ల దిగువకు భూగర్బ జలాలు పడిపోయాయి. ఏలూరులో చుట్టూ తమ్మిలేరు, కృష్ణా కాలువ ఉన్నా 37.568 నీటిమట్టం అడుగులకు దిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
 
డెల్టాలో ఫర్వాలేదు
డెల్టా ప్రాంతంలో నీరు అందుబాటులో ఉండటం వల్ల భూగర్భ జలమట్టాలు కొంత బాగానే ఉన్నా.. మెట్ట, పాక్షిక మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో అట్టడుగుకుపోతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తిచేసి చెరువుల్ని ఎప్పటికప్పుడు నింపితేనే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో ఆయిల్‌పామ్, ఇతర పంటల కోసం బోర్లు వేసి భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు.  
 
మరిన్ని వార్తలు