కేశాల పరిశ్రమకు కష్టకాలం

8 Mar, 2016 20:20 IST|Sakshi
కేశాల పరిశ్రమకు కష్టకాలం

అంతర్జాతీయ మార్కెట్‌కు నిలిచిన ఎగుమతులు
భారీగా పతనమవుతున్న ధరలు
పుణ్యక్షేత్రాల్లో తలనీలాల వేలం పాటకు స్పందన శూన్యం

 
తణుకు/ద్వారకాతిరుమల: నల్ల బంగారంగా పేరొందిన తలనీలాల(కేశాల) ధర తలకిందులైంది. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌లో కేశాలకు డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సంక్షోభం వల్ల ధర పతనమవుతోంది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కేశాల వేలం పాటకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. తలనీలాల ఎగుమతిలో పశ్చిమ గోదావరి జిల్లా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. జిల్లాలో గతేడాది తలనీలాల ఎగుమతిలో రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ జరగ్గా ఈ ఏడాది అందులో 50 శాతం కూడా దాటే అవకాశాలు కనిపించడం లేదు.

కేశాలకు ధర లేకపోవడానికి ప్రధాన కారణం భారత్ నుంచి చైనాకు ఎగుమతులు లేకపోవడమే. కేశాల కొనుగోళ్లను చైనా పూర్తిగా నిలిపివేసిందని, అందుకే నిల్వలు పెరిగి ధర పతనమైందని వ్యాపారులు చెబుతున్నారు. ఏడాది క్రితం రూ.కోటికి అమ్ముడైన స్పెషల్ గ్రేడ్ సరుకు ప్రస్తుతం మార్కెట్‌లో కేవలం రూ.25 లక్షలు పలుకుతోంది. సాధారణంగా తలనీలాలను పుణ్యక్షేత్రాల్లో కేశఖండనశాలల నుంచి సేకరిస్తుంటారు. వీటిని శుభ్రపర్చి గ్రేడ్లుగా విభజించి చైనా, అమెరికా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

కేవలం ఐదు శాతం మాత్రం ఇలా పుణ్యక్షేత్రాల నుంచి సేకరిస్తుండగా మిగిలినదంతా ఇళ్ల నుంచి సేకరిస్తారు. ఇళ్లనుంచి కేశాలను సేకరించే చిన్న వర్తకులపై ఇటీవలి కాలంలో సేల్ ట్యాక్స్ పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతుండడంతో ఈ ప్రభావం ఎగుమతులపై పడుతోంది. పన్ను పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 
కేంద్రానికి విజ్ఞప్తి చేశాం
‘‘యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం కారణంగా తలనీలాల ఎగుమతులు క్షీణించాయి. చిరు వ్యాపారులపై సేల్ ట్యాక్స్ పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంటింటికీ తిరిగి కేశాలను సేకరించే చిన్న వర్తకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సేల్ ట్యాక్స్ అధికారుల తీరుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఇదే పరిస్థితి కొనసాగితే కేశాల పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు’’

 - వంక రవీంద్రనాథ్,
 ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ అధినేత, తణుకు

>
మరిన్ని వార్తలు