హంస వాహనధీశా.. హరోంహర

19 Feb, 2017 21:58 IST|Sakshi
హంస వాహనధీశా.. హరోంహర
-  శ్రీశైలంలో వైభవంగా
   శివరాత్రి బ్రహ్మోత్సవాలు
- పోటెత్తుతున్న భక్తులు
- కళాకారుల ప్రదర్శనలు ఆమోఘం
 
శ్రీశైలం: హంసవాహనంపై దేవేరి భ్రామరీతో మల్లన్న మందస్మితదరహాస వీచికలతో  కనులపండువగా కనిపించడంతో భక్తులు ఆనందపరవశులయ్యారు.  శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి హంస వాహనంపై విశేష వాహనపూజలను అందుకున్నారు. అమ్మవారి ఆలయప్రాంగణం వద్ద ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో రాత్రి7.30 గంటలకు హంసవాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకారపూజలు, వాహన, వింజామర సేవలను వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు, వేదపండితులు పండితులు నిర్వహించారు. మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా, భక్తులు పంచాక్షరినామస్మరణ చేస్తున్న సమయాన  హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు.
 
అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన పురవీ«ధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఈ గ్రామోత్సవం నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా స్వామిఅమ్మవార్ల ఆలయప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలనర్పించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, హైకోర్టు మాజీ న్యాయమూర్తి గోదావరి ఘటన విచారణ కమిటీ చైర్మన్‌ జస్టీస్‌ సోమయాజులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.  
   
ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు: 
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. తప్పెట చిందులు, కోలాటం, బుట్టబొమ్మల నాట్యం, నందికోలు ఉత్సవం, డోలు కళాకారుల విన్యాసాలు, బంజరాల నృత్యప్రదర్శన, గొరవయ్యల ఈల పాటల నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలన్ని భక్తులను తమ అలసటను మరిచిపోయేలా చేశాయి. 
 
మరిన్ని వార్తలు