చేతిరాత..భవితకు బాట

16 Mar, 2017 02:03 IST|Sakshi
చేతిరాత..భవితకు బాట
పరీక్షల్లో ఆకట్టుకునే అక్షరాలు
మార్కులు పెరిగే అవకాశం
రాయవరం : అక్షరాలు కంటికి ఇంపుగా కనిపించేలా ఉండాలి. అందమైన దస్తూరి చూసేవారిని ఆకట్టుకుంటుంది. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారి మనస్సును హత్తుకునేలా ఉంటే మార్కులు వేసేలా ప్రేరేపిస్తుంది. అదే పరీక్షల్లో విజేతగా నిలుపుతుంది. మరో రెండు రోజుల్లో పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల్లో అక్షరాలను ముత్యాల్లా రాసే వారు పరీక్షల్లో 20 శాతం అధిక మార్కుల సాధనతో పాటు వారి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమాధానాలు రాయడంపై సూచనలు పాటిస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. 
అక్షరాలను రాయాలిలా..
పేజీకి పై భాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్‌ విడిచి పెట్టి రాయాలి. 
పేజీకి కుడివైపు అర అంగుళం ఖాళీ విడిచి పెట్టి రాయవాలి. ఇలా ఉంటే మూల్యాంకన సమయంలో ఉపాధ్యాయునికి జవాబులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెలుపు కాగితాలపై సాధన చేయాలి. 
జవాబుల్లో ఏదైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్‌తో గీతగీయాలి. 
విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాలను చేతితో రాయించాలి. 
జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాన్ని ఒకవైపు సరళరేఖలను గీసి భాగాల పేర్లు రాస్తే మేలు. లేదా వాటి నంబర్లు ఇచ్చి ఒకవైపు రాయాలి. 
పరీక్ష పత్రంతో ప్రశ్నలు సెక‌్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాన్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలోనే జవాబులు రాయడం పూర్తిచేయాలి.
 
విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినవి..
జవాబు రాసే తీరు పరీక్ష పేపరు దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. సమాధానాలు టీచరుకు తెలుసునని గుర్తించాలి. 
జవాబు పత్రం ఆకట్టుకోవాలంటే పేజీకి 18–19లైన్లకు మించకూడదు. 
జవాబు పత్రంలోని తొలి లైన్‌ రాసే సమయంలో మార్జిన్‌ లైన్‌ను చూస్తూ సమాంతరంగా రాయకపోతే మిగిలిన లైన్లు వంకర్లు తిరుగుతాయి.
గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదంగానీ, మరో సగాన్ని కిందలైన్లో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏమిటో అర్థం కాదు. పదం పూర్తిగా రాయాలి.
ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టి మరీ రాస్తే రెండో వైపు అక్షరాలు కన్పిస్తూ గందరగోళం మారుతుంది. కొద్ది సేపు రాయగానే వేళ్లు నొప్పి పుడతాయి. అందుకే తేలికగా అందంగా రాయాలి.
అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్థం చేసుకోలేక మార్కులు వేయరు. సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాన్ని గుర్తించడంలో ఒక క్రమపద్ధతి పాటించాలి.
 
పాయింట్ల వారీగా...
పరీక్షల్లో రాసే అక్షరాలు అర్థమయ్యేలా ఉంటే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడు ముగ్దుడై మార్కులు వేస్తాడు. లేదంటే వెనకడుతారు.
సమాధానాల్లో దోషాలు లేకుండా జాగ్రత్త పడాలి.
సంగ్రహ ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయాలి.
ఇచ్చి ప్రశ్నలను పూర్తిగా అర్థం చేసుకుని రాయాలి. 
స్టోరీ రైటప్‌లో మంచి మార్కులు సాధించాలంటే ఇచ్చిన హింట్‌ను బాగా చదివి అర్థం చేసుకుని రాయాలి. 
ప్రశ్నలకు జవాబులు పాయింట్ల వారీగా రాస్తే మార్కులు బాగా వస్తాయి. జవాబులకు మధ్యలో ఉప శీర్షికలు పెట్టాలి. ముఖ్య విషయాలను అండర్‌లైన్‌ వేసుకోవాలి.
బిట్‌పేపరు రాసే సమయంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి.
మరిన్ని వార్తలు