కృష్ణా మహిళల హ్యాండ్‌బాల్‌ ట్రోఫీ లయోలా కైవసం

5 Dec, 2016 21:42 IST|Sakshi
కృష్ణా మహిళల హ్యాండ్‌బాల్‌ ట్రోఫీ లయోలా కైవసం

విజయవాడ(వన్‌టౌన్‌) : కృష్ణా విశ్వవిద్యాలయం (మహిళల) హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ ట్రోఫీని ఆంధ్రా లయోలా కైవసం చేసుకుంది. కేబీఎన్‌ కళాశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్‌ కళాశాలల (మహిళల) హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ సోమవారం ఆ కళాశాల ప్రాంగణంలో సందడిగా జరిగింది. జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన మహిళా హ్యాండ్‌బాల్‌ జట్లు ఈ పోటీలో తలపడ్డాయి. అందులో ఫైనల్స్‌లో పోటాపోటీగా ఆడిన కేబీఎన్‌  కళాశాలపై, ఆంధ్రా లయోలా కళాశాల మహిళా హ్యాండ్‌బాల్‌ జట్టు  విజయం సాధించింది. ఆంధ్రా లయోలా, కేబీఎన్, సిద్ధార్థ మహిళా కళాశాలలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి.  ఉదయం నుంచి జరిగిన మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. ఆయా కళాశాలలకు చెందిన విద్యార్ధులు హజరై క్రీడాకారులను తమ హర్షధ్వనాలతో ఉత్సాహపరిచారు.
క్రీడలతో వ్యక్తిత్వ వికాసం
క్రీడలతో విద్యార్ధుల వ్యక్తిత్వ సాధ్యమవుతుందని పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ అధ్యక్షుడు చలవాది మల్లికార్జునరావు అన్నారు.  కేబీఎన్‌  కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కృష్ణా విశ్వవిద్యాలయం మహిళల హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ ముగింపు సభ  సోమవారం సాయంత్రం జరిగింది  మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పల సాంబశివరావు, ఎస్‌.రజిత్‌కుమార్‌, కృష్ణా విశ్వవిద్యాలయం స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడారు. ఉదయం జరిగిన ప్రారంభోత్సవ సభకు ఏలూరు రేంజ్‌ స్పెషల్‌బ్రాంచ్‌ ఎస్‌ఐ, పూర్వ విద్యార్ధి ఎం.సుధాకర్, జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఆర్‌.సిజర్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీ.నారాయణరావు, కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.సాంబశివరావు, పూర్వ ఫిజికల్‌ డైరెక్టర్‌ నరేంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు