వైకల్యాన్ని జయించాడు

7 Oct, 2016 00:48 IST|Sakshi
వైకల్యాన్ని జయించాడు

అందరిలాగే బాల్యంలో ఆడుతూపాడుతూ పెరిగాడు. ఐదు సంవత్సరాల వయసులో అమ్మనాన్నతో కలిసి విహారయాత్ర   ముగించుకుని ఇంటికి వస్తుండగా వాహనం రోడ్డు ప్రమాదానికి గురయింది. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాస్త కోలుకోవడానికి నెలలు పట్టింది. విధి వైకల్యాన్ని ప్రసాదించినా అతడు కుంగిపోలేదు. తనకంటూ ఓ ప్రత్యేకత కోసం పాటుపడ్డాడు.  సంకల్పానికి ఏదీ అడ్డురాదంటూ నిరూపించాడు. కరాటే, క్రికెట్‌ పోటీల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఎన్నో పథకాలు, సర్టిఫికెట్లు, ప్రశంసలు పొంది పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. అతడే రామచంద్ర.


హిందూపురం పరిధిలోని కిరికెర పంచాయతీలో సిరికల్చర్‌ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, వెంకటరమణల కుమారుడు రామచంద్ర.  తల్లి కూలి పనికి వెళ్తుండగా, తండ్రి ఓ  ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బాల్యంలో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తల ఒక వైపునకు ఒంగి, నడవడానికి, కూర్చోవడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. కరాటే నేర్చుకుంటే అవయవాలపై పట్టు సాధించవచ్చని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో శరీరం సహకరించకపోయినా అతడు కరాటేలో శిక్షణ తీసుకున్నాడు. అలాగే క్రికెట్‌లో సైతం ప్రవేశం పొందాడు.   10వ తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితులు, వైకల్యంతో ఉన్నత చదువులకు వెళ్లలేకపోయాడు.

1999 నుంచి కరాటే, క్రికెట్‌పై దృష్టి సారించాడు.  మెలకువలు తెలుసుకుని పట్టు సాధించాడు.  ప్రస్తుతం కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ 4వ డాన్‌గా అంతర్జాతీయ స్థాయికి, క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్‌ కీపర్‌గా ఆల్‌రౌండ్‌ ప్రతిభ సాధించి జాతీయస్థాయికి ఎదిగాడు. ఇప్పటి వరకు 100కి Sపైగా పతకాలు, సర్టిఫికెట్లు సొంతం చేసుకున్నాడు. 14 సార్లు కరాటేలో నేషనల్‌ స్థాయిలో గోల్డ్‌మెడల్స్‌ను సాధించాడు. ప్రస్తుతం జిల్లా వికలాంగుల క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ సభ్యుడిగా, కుంగ్‌ ఫూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.

ప్రతిభ ఉన్న వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
ఆరోగ్యం కోసం అభ్యసించిన కరాటే ఆత్మ విశ్వాçÜం పెంచింది. డ్రాగన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే అకాడమీ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన వికలాంగుల క్రికెట్, కరాటే పోటీల్లో ఎన్నో పతకాలను, అవార్డులను సొంతం చేసుకున్నప్పటికీ ప్రతిభకు సహకారం లభించడం లేదు. ప్రతిభ ఉన్నవారిని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలి.
– రామచంద్ర, డ్రాగన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు

మరిన్ని వార్తలు