కాంట్రాక్టర్ల కోసమే హంద్రీనీవా విస్తరణ పనులు

29 May, 2017 23:48 IST|Sakshi
- నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య 
పగిడ్యాల: కాంట్రాక్టర్లను బతికించడానికే రూ. 1000 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ విస్తరణ పనులను టెండర్లు పిలిచారని  నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య ఆరోపించారు. సోమవారం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రమాదేవి స్వగృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా కాలువకు సంబంధించి పిల్ల కాలువలు, నీటి కుంటలు, తూములు ఏర్పాటు చేయకుండా విస్తరణ పనులు చేసి పలమనేరుకు నీరు తరలించాలని చూస్తే సహించబోమన్నారు. విస్తరణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండు పంప్‌లను పూర్తి చేయించి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేయడంలోని ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు.
 
 జూన్‌ ఒకటో తేదీన నందికొట్కూరు పట్టణం అక్షర శ్రీ పాఠశాలలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఫ్లీనరీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ మోసాలను ప్రజల ముందు ఉంచి పలు తీర్మానాలను చేస్తామన్నారు. టీడీపీ మహానాడుకు ఎన్‌టీఆర్‌ కుటుంబ సభ్యులైన హరికృష్ణ, బాలకృష్ణలకు ఆహ్వానించకపోవడం విచారకరమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు.. తన మూడేళ్ల పాలనలో ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గంగి రవి, రమణారెడ్డి, వెంకటరామిరెడ్డి, భూపాల్‌రెడ్డి, చిట్టిరెడ్డి, కిరణ్‌రెడ్డి, డీలర్‌ నారాయణ, పక్కిరెడ్డి, ఇస్మాయిల్, నరసింహులు, బోయ జయరాముడు తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు