అక్షర యోధుడు హనుమంతరావు

18 Dec, 2016 07:51 IST|Sakshi
అక్షర యోధుడు హనుమంతరావు

పంజగుట్ట:     అక్షరాన్నే నమ్ముకున్న అత్యుత్తమ పాత్రికేయుడు హనుమంతరావును నవతరం జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని  పలువురు వక్తలు కొనియాడారు. శనివారం సోమాజిగూడలో ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు వరదాచారి అధ్యక్షతన సీనియర్‌ జర్నలిస్టు హనుమంతరావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు. హనుమంతరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నా రు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ.. హనుమంతరావు ఒక తపస్వి అని కొనియాడారు. సమాజాన్ని ప్రభావితం చేసే ఆర్థికపరమైన విషయాలు నిశితంగా పరిశీలించేవారన్నారు. ఆయన పేరుతో యేటా స్మారకోపన్యాసం ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్  అల్లం నారాయణ మాట్లాడుతూ.. నిబద్ధతకు అసలైన గురువు హనుమంతరావు అని పేర్కొన్నారు. అక్రిడిటేషన్   కమిటీలో డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు అందులోనూ  మహిళలకు 33 శాతం కోటా ఇచ్చామంటే అది ఆయన స్ఫూర్తితోనే అని, ఆయన మహిళా జర్నలిస్టులకు సొంత ఖర్చుతో అవార్డులు ఇచ్చేవారని గుర్తుచేశారు.


‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌  కె.రామచంద్రమూర్తి  మాట్లాడుతూ .. రెండు తరాల జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడు హనుమంతరావు అని కొనియాడారు. ప్రభుత్వానికి దూరంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపేవారన్నారు. వర్తమాన పరిణామాల నేపథ్యంలో కథనాలు  రాసేవారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక పోకడలు, వైద్యం, ఆరోగ్యంపై ఎన్నో కథనాలు రాశారని గుర్తుచేసుకున్నారు. సమాజాన్ని అన్ని రకాలుగా పరిశీలించి రాసేవారని, కేవలం అక్షరాన్నే నమ్ముకుని జీవితం గడిపిన వ్యక్తి అని కొనియాడారు. హనుమంతరావును కొత్త జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ .. జర్నలిస్టు సమాజం గురించి మాట్లాడాలంటే ముందుగా హనుమంతరావు గురించే మాట్లాడాలన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటే జాతి, సమాజ హితానికి ఎంతో మంచిదన్నారు. ప్రస్తుతం నోట్ల రద్దుతో ఎంతో నిష్ణాతులైన ఆర్థిక నిపుణులు కూడా రెండు పాయలుగా చీలారని, అదే ఆర్థిక పరిస్థితులపై హనుమంతరావు వ్యాసాలు ఎంతో సరళంగా ఉండేవన్నారు. సమాజహితం కోసం పనిచేసిన వ్యక్తి హనుమంతరావు అని పేర్కొన్నారు.


సీనియర్‌ పాత్రికేయుడు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ .. హనుమంతరావు వర్ధంతి రోజు ప్రెస్‌క్లబ్‌లో సభ నిర్వహించాలని సూచించారు. నవ తెలంగాణ సంపాదకుడు వీరయ్య మాట్లాడుతూ.. పాత్రికేయ విలువలకే కాదు సమాజ విలువలకు కూడా కట్టుబడిన వ్యక్తి హనుమంతరావు అని చెప్పారు. ఆయన చనిపోయే ముందు కూడా నవతెలంగాణలో వ్యాసం రాశారని గుర్తుచేసుకున్నారు. హన్మంతరావు కుమారుడు, సీనియర్‌ జర్నలిస్టు సతీష్‌ మాట్లాడుతూ .. నాన్న బతికున్న సమయంలో అంత్యక్రియలు నిర్వహించవద్దని చెప్పేవారని, గాంధీ మెడికల్‌ కాలేజీకి తన భౌతికకాయాన్ని ఇవ్వాలని కోరేవారని, ఆయన అభిప్రాయాన్ని గౌరవించామన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు.


ప్రెస్‌క్లబ్‌ ప్రధాన కార్యదర్శి విజయ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ .. ప్రెస్‌క్లబ్‌ వ్యవస్థాపక సభ్యుడైన హనుమంతరావు ఆశయాలను ముందు కు తీసుకువెళతామని, ప్రతీ సంవత్సరం ఆయన మెమోరియల్‌ స్పీచ్‌ను ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హనుమంతరావు అర్ధాంగి సరళ, కొడుకు చలపతిరావు, సతీష్‌బాబు, కోడళ్లు రమ, మాధురి, కూతురు పద్మ, సీనియర్‌ జర్నలిస్టులు జ్వాలా నర్సింహారావు, తెలకపల్లి రవి, పాశం యాదగిరి, నగేశ్‌ కుమార్, లక్ష్మి, బండారి శ్రీనివాస్, రాధాకృష్ణ, వేణుగోపాల్, గాయత్రి, రాజమౌళి చారి తదితరులు పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు